Smriti Mandhana wedding update: భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మందాన ను దురదృష్టం వెంటాడుతోంది. ఇటీవల టీమిండియా సాధించిన వరల్డ్ కప్ లో ఆమె ముఖ్యపాత్ర పోషించింది. కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడి అద్భుతాన్ని సృష్టించింది. ఓపెనర్ గా టీమిండియా కు బలమైన భాగస్వామ్యాలు అందించింది. అటువంటి స్మృతి ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. తన చిరకాల ప్రేమికుడు పలాష్ ముచ్చల్ తో వైవాహిక బంధం లోకి ప్రవేశించడానికి అన్ని సిద్ధం చేసుకుంది. ఎంగేజ్మెంట్ తర్వాత.. ఆదివారం మహారాష్ట్రలోని సాంగ్లీ లో వివాహం జరుపుకోవడానికి ఘనమైన ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఇంతలోనే ఆమెకు వరుసగా అపశకునాలు ఎదురయ్యాయి. దీంతో వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది.
వివాహానికి ఏర్పాట్లు జరుగుతుండగానే ఆమె తండ్రి శ్రీనివాస్ ఉన్నట్టుండి కింద పడిపోయారు.. దీంతో వివాహ వేదిక వద్దకు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్సులో శ్రీనివాస్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర వైద్య విభాగంలో అతడిని చేర్పించారు. దీంతో ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ శ్రీనివాస్ కు గుండెపోటు రావడం పట్ల కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి ఓవైపు ఆసుపత్రిలో ఉండగానే స్మృతికి మరో బ్యాడ్ న్యూస్ తెలిసింది. స్మృతికి కాబోయే భర్త ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైరల్ ఫీవర్ తో పాటు ఎసిడిటీ పెరిగిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అతడు కూడా ఆస్పత్రిలో చేరాడు. మరోవైపు స్మృతి తండ్రిని వైద్యులు ఇప్పటికే అబ్జర్వేషన్ లో ఉంచారు. కొద్ది రోజులు గడిస్తే ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు స్మృతికి కాబోయే భర్త కూడా అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. అటు తండ్రి.. ఇటు కాబోయే భర్త ఇద్దరు ఆస్పత్రిలో ఉండడంతో స్మృతి తీవ్ర విచారంలో ఉంది.
స్మృతికి వరుసగా దురదృష్టకరమైన సంఘటనలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇంతటి కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచిస్తున్నారు. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న తరుణంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎదురు కావడం బాధాకరమని పేర్కొంటున్నారు. భగవంతుడు ఆమెకు ధైర్యాన్ని.. మనో నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.