CSK Captain : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి స్థానంలో ఉంటుంది. మిగిలిన జట్లతో పోలిస్తే చెన్నై జట్టుకు భారీగా అభిమానులు ఉండడానికి ఏకైక కారణం మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో రవీంద్ర జడేజా కు అవకాశం కల్పించినప్పటికీ సానుకూల ఫలితం రాకపోవడంతో మళ్లీ ధోని పగ్గాలు అందుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కూడా ధోని సారధ్యంలోని చెన్నై జట్టు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కు ధోని అందుబాటులో ఉండడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ధోని రిటైర్మెంట్ పై ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోని ఐపీఎల్ లోను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధ్య బాధ్యతలను ఎవరు నెరవేరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ఒక యంగ్ ప్లేయర్ పై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోని రికార్డ్ సృష్టించాడు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ముంబై జట్టు సరసన నిలిచింది చెన్నై. అలాగే, పలుసార్లు సెమీఫైనల్స్ వరకు వెళ్లింది ఈ జట్టు. ఐపీఎల్ లో మరో జట్టుకు సాధ్యం కాని రీతిలో విజయాలను, రికార్డులను తన పేరిట సృష్టించుకుంది చెన్నై జట్టు. ఈ జట్టు విజయాలు వెనక మూల స్తంభంగా మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. అయితే, వచ్చే సీజన్ నుంచి ధోని ఐపిఎల్ ఆడడు అన్న చర్చ జోరుగా సాగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ధోని ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే, ఈ ప్రశ్నకు యంగ్ ప్లేయర్ ద్వారా సమాధానం చెప్పాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధోని వారసుడిగా కెప్టెన్సీ బాధ్యతలను ఆ యంగ్ క్రికెటర్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చెన్నై జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు వెల్లడించడంతో వాస్తవమేనని పలువురు పేర్కొంటున్నారు. గతంలో రవీంద్ర జడేజా కు బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మళ్లీ ధోనీకే బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో యంగ్ క్రికెటర్ కు అవకాశాలు కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెన్నై జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రుతురాజ్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం..
చెన్నై జట్టు సాధిస్తున్న విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఈ ఏడాది చెన్నై జట్టు టోర్నీ విజేతగా నిలవడంలో గైక్వాడ్ కీలకంగా వ్యవహరించాడు. అటువంటి గైక్వాడ్ నే ధోనీ వారసుడిగా బరిలోకి దించాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అంబటి రాయుడు బయటకు చెప్పడంతో కన్ఫామ్ చేస్తున్నారు. ధోని మాదిరిగానే రుతురాజ్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిలో నాయకత్వ లక్షణాలు దాగున్నాయని రాయుడు వెల్లడించాడు. ఎంఎస్ ధోని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సహకారంతో అతను సీఎస్కేకు ఎక్కువ కాలం సేవలు అందించే అవకాశం ఉందని రాయుడు అభిప్రాయపడ్డాడు. ఇకపోతే ఆసియా గేమ్స్ కు వెళుతున్న భారత జట్టుకు రుతురాజు గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్ లో సత్తా చాటితే మాత్రం సీఎస్కే తదుపరి కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను చెన్నై యాజమాన్యం కన్ఫామ్ చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.