NZ vs AFG : ఇక ప్రస్తుతం భారత్ వేదికగా ఆఫ్గనిస్తాన్ – న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ సిరీస్ జరుగుతోంది. బీసీసీఐ సహకారంతో ఆఫ్గానిస్థాన్ కు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తాత్కాలిక హోం గ్రౌండ్ గా మారింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిభద్రతల దృష్ట్యా అక్కడ సిరీస్ నిర్వహించడం దాదాపు అసాధ్యం. అయితే ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ – న్యూజిలాండ్ పరస్పరం తలపడలేదు. ఈ రెండు జట్లకు ఇదే తొలి టెస్ట్ సిరీస్. ఈ రెండు జట్లు భారత్ వేదికగా కూడా ఇంతవరకు టెస్ట్ సిరీస్ ఆడలేదు. అయితే ఈ రెండు జట్లు టి20 ప్రపంచ కప్ లో మూడుసార్లు తలపడ్డాయి. 2015, 2019లో జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆఫ్గనిస్తాన్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.. ఆ ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచే టి20 వరల్డ్ కప్ లో నిష్క్రమించింది.. ఆఫ్ఘనిస్తాన్ సెమిస్ దాకా వచ్చింది. సెమిస్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఇక న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే ప్రపంచ కప్ లో మూడుసార్లు తలపడగా.. మూడుసార్లు కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది.
న్యూజిలాండ్ జట్టు దే పై చేయి కానీ..
వైట్ బాల్ ఫార్మాట్ లో న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. వన్డేలు, టి20 లలో ఆఫ్గనిస్తాన్ పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. టి20 వరల్డ్ కప్ లో ఓటమి తర్వాత.. న్యూజిలాండ్ జట్టు ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా దానిని నెరవేర్చుకోవాలని భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే ఆఫ్గనిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఆ జట్టులో సంచలన ఆటతీరును ప్రదర్శించే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. పైగా వాళ్లకు భారత ఉపఖండం మైదానాలపై ఆడిన అనుభవం ఉంది. తమదని రోజు ఏదైనా చేయగలిగే సత్తా ఉంది. ఒక వేళ పరిస్థితి తారుమారయితే.. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ జట్టుకు ఎదురైన అనుభవమే.. న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ ఆట అనిశ్చితికి పర్యాయపదం. బ్యాటింగ్, బౌలింగ్ లో న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ లో అప్పుడప్పుడు అద్భుతాలు చేసే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అటు బంతి, ఇటు బ్యాట్ తో వారు మెరువగలరు. ఏ మాత్రం అవకాశం లభించినా సంచలనాలు సృష్టించగలరు. అలాంటప్పుడు న్యూజిలాండ్ జట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More