Abhishek Sharma: అభిమానులకు పైసా వసూల్. వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన టికెట్లకు జస్టిఫై అయింది. అసలు సిసలైన క్రికెట్ మజా అభిమానులకు లభించింది. ఓవైపు వాతావరణం చల్లగా ఉంది. కానీ తన బ్యాటింగ్ విశ్వరూపంతో దానిని అత్యంత వేడిగా మార్చాడు అభిషేక్ శర్మ. తనకు అచ్చి వచ్చిన ఉప్పల్ మైదానంలో తుక్కు తుక్కు కొట్టాడు. దీంతో బంతి గ్రావిటీకి వ్యతిరేకంగా పరుగులు పెట్టింది. చూస్తుండగానే హైదరాబాద్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు అభిషేక్ శర్మ ఖాతాలో మరో సెంచరీ నమోదయింది.
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ హైదరాబాద్ ఆటగాళ్లు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చెన్నై జట్టు ఆటగాడు సంజు ఆ ఘనతను అందుకున్నాడు. డికాక్, తిలక్ వర్మ ఇద్దరు సెంచరీలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో అభిషేక్ శర్మ చేరిపోయాడు.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అభిషేక్ శర్మ.. లుంగీ ఎంగిడి నుంచి మొదలు పెడితే.. నితీష్ రానా వరకు బౌలర్ నూ వదిలిపెట్టలేదు.. 47 బంతుల్లో అభిషేక్ శర్మ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.. ఈ కథనం రాసే సమయం వరకు అతడు 51 బంతులలో 115 పరుగులు చేశాడు.
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా సెంచరీ చేశాడు. తొలి వికెట్ కు హెడ్ తో కలిసి 97, రెండో వికెట్ కు ఇషాన్ కిషన్ తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఈ సెంచరీ ద్వారా అభిషేక్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ సెంచరీ ద్వారా దెబ్బకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలబడ్డాడు అభిషేక్.. ఏడు మ్యాచ్లు ఆడిన అతడు 50.83 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు, 27 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల కంటే, సిక్సర్లు అధికంగా ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అభిషేక్ ఈ టోర్నీలో ప్రారంభ మ్యాచ్లలో ఇబ్బంది పడ్డాడు. పరుగులు తీయడంలో తడబడ్డాడు. దీంతో అతడిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు వినిపించాయి. చివరికి అభిషేక్ గట్టిగా నిలబడ్డాడు. తన బ్యాటింగ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు. చెత్త బంతులను శిక్షించిన అతడు.. ఇబ్బంది పెట్టే బంతులకు మాత్రం రెస్పెక్ట్ ఇచ్చాడు. అందువల్లే ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ వరసగా చేసి అదరగొట్టాడు. మొత్తంగా ఉప్పల్ మైదానాన్ని షేక్ చేశాడు.