AB de Villiers: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోయింది. ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన పంజాబ్.. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. బెంగళూరుకు ఏకపక్ష విజయాన్ని అందించకుండా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి.
టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్ 37 బంతుల్లో 45 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ ఎనిమిది బంతుల్లో 21 పరుగులు చేసి సత్తా చాటాడు. అనంతరం బెంగళూరు జట్టు ఆరు వికెట్ల కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. చివర్లో దినేష్ కార్తీక్ పది బంతుల్లో 25 పరుగులు చేశాడు. మహిపాల్ ఎనిమిది బంతుల్లో 17 పరుగులు చేసి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా క్రికెటర్, మిస్టర్ 360 డివిలియర్స్, భారత దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందించారు. మ్యాచ్ ను తమదైన శైలిలో విశ్లేషించారు.”ధావన్ పేలవమైన వ్యూహాలు రచించాడు. రబాడ నాలుగు ఓవర్ల కోటా ముందే ఎలా పూర్తి చేయిస్తారు. అతడు కీలకమైన బౌలర్ కదా.. జట్టుకు అతని సేవలు ఎంతో అవసరం. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి బౌలర్ ను బ్యాక్అప్ లాగా పెట్టుకోవాలి. ఇది ధవన్ అర్థం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో రబాడ 4 ఓవర్లు వేశాడు. 23 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. ధావన్ నిర్ణయం వల్ల 14 ఓవర్ల లోపే అతడి సెల్ పూర్తయింది. ఇది శిఖర్ చేసిన పెద్ద తప్పు. ఈ నిర్ణయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. బెంగళూరు బాగానే ఆడుతుంది కదా.. కాబట్టి మ్యాచ్ చివరి వరకు సాగుతుంది.. పైగా అది వారి సొంతమైదానం.. అలాంటప్పుడు సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం శిఖర్ పై ఉంది. అయితే దానిని అతడు పూర్తిస్థాయిగా అమలు చేయలేకపోయాడని” డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
“స్పిన్నర్ రాహుల్ చాహర్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అందుకే రబాడ కోటా ముందే పూర్తి చేశాడు కావచ్చు. ఒకవేళ చార్ బౌలింగ్ బాగా చేసి ఉంటే రబాడాను పంజాబ్ చివరి వరకు కొనసాగించి ఉండేది. రాహుల్ చాహర్ ఒక్క ఓవర్ లోనే 16 పరుగులు సమర్పించుకున్నాడు. టి20 లో ఇలాంటి ప్రదర్శన మంచిది కాదు. అది అంతిమంగా జట్టుకు నష్టం చేకూర్చుతుంది. అందువల్లే ధావన్ రబాడా తో బౌలింగ్ చేయించాడు. అయినప్పటికీ పంజాబ్ ఓడిపోయిందని” అనిల్ కుంబ్లే విశ్లేషించాడు.