Yamuna Pushkaralu 2026: భారతీయ సనాతన సంప్రదాయంలో పుష్కరాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అవకాశంగా నిలవనున్నాయి. ఈ ఏడాదిలో యమునా పుష్కరాలు సాగనన్నాయి. గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించే సందర్భంగా యమునా నదికి పుష్కర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ పుష్కరాల ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల్లో ఏం చేయాలి?
యమునా పుష్కరాలు 2026 జూన్ 2వ తేదీన ప్రారంభమై జూన్ 13వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు ‘ఆది పుష్కరం’, చివరి రోజు ‘అంత్య పుష్కరం’గా పరిగణిస్తారు. ఈ రెండు రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. బ్రహ్మముహూర్తంలో, ముఖ్యంగా ఉదయం 4:30 నుంచి 7 గంటల మధ్య పుష్కర స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
యమునా దేవి సూర్యభగవానుడి కుమార్తె. యమధర్మరాజు సోదరిగా పురాణాల్లో వర్ణించబడింది. అలాగే శ్రీకృష్ణుడి లీలలతో యమునా నదికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పుష్కర కాలంలో యమునా జలాల్లో స్నానం చేస్తే పాప విమోచనం, పితృదేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని విశ్వాసం.యమునా నది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి నుంచి ప్రారంభమై హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. ఈ మొత్తం ప్రవాహ ప్రాంతంలో పుష్కర స్నానం చేయవచ్చు. అయితే కొన్ని క్షేత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
యమునా నది జన్మస్థానంగా ప్రసిద్ధి చెందిన యమునోత్రిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది.
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురలోని విశ్రాంత్ ఘాట్ యమునా పుష్కరాలకు ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. కంసుడిని సంహరించిన అనంతరం శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాలు చెబుతాయి.
కేశీ ఘాట్, ఇతర యమునా తీర్థాలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. శ్రీకృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు.
నిగంబోధ్ ఘాట్ వద్ద కూడా వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు.
త్రివేణి సంగమం వద్ద గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యకరంగా భావిస్తారు. పితృకార్యాలకు ఇది ప్రముఖ క్షేత్రం.
పుష్కరాల్లో ఏ దానాలు చేయాలి?
పుష్కర కాలంలో దానం చేయడం ద్వారా స్నాన ఫలితం మరింత పెరుగుతుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. ముఖ్యంగా అన్నదానం అత్యుత్తమ దానంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ద్వారా అపార పుణ్యం లభిస్తుందని చెబుతారు. వస్త్రదానం, గోదానం, విద్యార్థులకు పుస్తకాల దానం, పేదలకు చెప్పులు, గొడుగులు, నీటి పాత్రలు, ధాన్యాలు దానం చేయడం కూడా శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. వేసవి కాలం కావడంతో చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయడం విశేష పుణ్యప్రదమని పండితులు సూచిస్తారు.
