https://oktelugu.com/

Manthani Laddu : మంథని లడ్డూకి ఎందుకంత ప్రాచుర్యం?

అవధానుల మురళీధర్ అనే ఒక వ్యక్తి ఏకంగా 50 లడ్డూలు తినడంతో ఆయన పేరు లడ్డూల మురళిగా మారిపోయింది. అలాగే చొప్పకట్ల రాము అనే ఒక యువకుడు ఏకంగా 66 లడ్డూలు తిని రికార్డ్ బ్రేక్ చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2024 / 08:40 PM IST

    manthani laddu

    Follow us on

    Manthani Laddu : మీరెప్పుడైనా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని లడ్డూ టేస్ట్ చేశారా..? ఏం.. ఆ లడ్డూకు ఎందుకంత విశిష్టత అంటే… మంథనిలో చేసే లడ్డూకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.. సాధారణంగా లడ్డూ తయారీకి ప్రధానంగా వాడేది నెయ్యి. కానీ కొంతమంది రిఫైన్డ్ ఆయిల్ వాడుతారు. గతంలో డాల్దా నెయ్యి వాడేవారు. కానీ మంథని లో మాత్రం మంచి నెయ్యిని ఉపయోగిస్తారు. అందుకే చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో మధురంగా ఉండే ఈ లడ్డు తయారీలో వాడే సుగంధ ద్రవ్యాలతో పాటు ప్రేమ, ఆప్యాయతలను కలబోస్తారు. చిన్న, పెద్ద ఫంక్షన్ అని తేడా లేకుండా అని కార్యక్రమాలకు ఎన్ని స్వీట్లు పెట్టినా మంథని మోతీచూర్ బూందీ లడ్డూ కు సాటి రావు అంటున్నారు. ప్రత్యేకంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు చేసే లడ్డూ ప్రసాదం వేద మంత్రోచ్చారణల మధ్య, లలిత సహస్ర నామ స్మరణ చేస్తూ తయారు చేయడంతో దైవికత ఆపాదించబడుతుంది. అందుకే ఆ లడ్డూ ప్రసాదం తీసుకోవాలని ఎంతోమంది ఆరాట పడుతారు. ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి సామూహిక సహస్ర ప్రభోజనల వరకు, ఏ శుభాశుభ కార్యాలకైనా బూడిద గుమ్మడి కాయ శాకం, చల్లా పులుసు(మజ్జిగ పులుసు), పాలకూర (పాతాళ బాజీ) తో పాటు ఎన్ని స్వీట్లు పెట్టినా, లడ్డూ కే ఎక్కువ ప్రాధాన్యత. ముఖ్యముగా మోతీచూర్ బోంది లడ్డూ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ లడ్డూ బోంది సైజు ముత్యం అంత పరిమాణంలో ఉంటుంది. మోతీ అంటే మరాఠీలో ముత్యం అని అర్థము. అందుకే మోతీ చూర్ బోంది లడ్డూ అని అంటారు.

    అలాగే ఇక్కడి లడ్డూ పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. అలాగే మంథని వారు కేవలం తయారు చేయడంలోనే కాదు తినడంలో కూడా వేరెవ్వరు సాటిరారు. మంథని లడ్డూ ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తినడం కష్టమే.. కానీ మంథని వారు మాత్రం 30 నుంచి 66 వరకు అలవోకగా తినే వాళ్ళు ఉన్నారు. భోజనాల్లో పోటీ పడి మరీ ఒకరికంటే ఒకరు ఎక్కువ తినేందుకు ఉత్సాహం చూపిస్తారు..

    అవధానుల మురళీధర్ అనే ఒక వ్యక్తి ఏకంగా 50 లడ్డూలు తినడంతో ఆయన పేరు లడ్డూల మురళిగా మారిపోయింది. అలాగే చొప్పకట్ల రాము అనే ఒక యువకుడు ఏకంగా 66 లడ్డూలు తిని రికార్డ్ బ్రేక్ చేశారు. ఇలా చాలామంది యువకులు 30 నుంచి 40 లడ్డూలు అలవోకగా తినేవారు ఉన్నారు.

    కొన్నేళ్ల క్రితం మంథనికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో ఒక ఫంక్షన్ కు వచ్చిన అప్పటి ఇరిగేషన్ మంత్రివర్యులు భోజనాల సందడిలో మంథని లడ్డూ మాయలో పడి తాను మంత్రి అన్న సంగతి మర్చిపోయారు. ఎవరైనా గమనిస్తున్నారని కూడా చూడకుండా బఫెలో ఏర్పాటు పెట్టిన లడ్డూలను కొన్ని లాల్చీ జేబులో వేసుకోవడం చూసి అందరం నవ్వుకోవడం కొసమెరుపు..

    – దహగాం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్