Temples On Hills: ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది దేవుడని కొందరు అభిప్రాయ పడుతుంటారు. ఒక మనిషి పుట్టుక, జీవించడం, మరణం అన్ని కూడా దేవుడి చేతుల్లో ఉంటుందని అంటుంటారు. అయితే ఎవరి మతంలో వారు దేవుడిని కొలుస్తుంటారు. ముఖ్యంగా హిందువులు అయితే చాలా భక్తితో దేవుడుని కొలుస్తారు. ఒక్కసారి నమ్మితే ఎంత దూరంలో ఉన్నా కూడా వెళ్తుంటారు. అయితే చాలా దేవుళ్లు కొండల పైనే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి, యాదగిరి గుట్ట, సింహాచలం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ ఆలయాలు నేల మీద కంటే కొండలపైనే ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నదులు, పర్వతాలు, వృక్షాలను పరోపకార పరాయణులు అని అంటారని మహాకవి వాల్మీకి తెలిపారు. ఈ కారణం చేతనే చాలా మంది రుషులు తపస్సు చేసి కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. అలాగే కొండలగా పుట్టిన వారిపై దేవుళ్లు, దేవతలు పుట్టాలని కోరుకుంటారు. అయితే ఎక్కువ శాతం కొండ మీద ఉండే దేవుళ్లు రుషులకు వరాలు ఇచ్చి కొండలపై వెలిశారు.
దేవుళ్లు కొండలపైన వెలియడానికి ఇంకో కారణం కూడా ఉంది. కొండలపై దేవుడు ఉంటే అక్కడికి కష్టపడి, భక్తితో వెళ్తామా? లేదా? అని దేవుడు పరీక్షిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చిన కూడా దేవుడిని చూడటానికి వస్తాడా లేకపోతే రాడా అని పరీక్షలు పెట్టడానికి దూరంలో వెలుస్తాడట. అలాగే పూర్వం సత్య యుగం ప్రారంభంలో దేవుళ్లు, దేవతలు కొండ మీద కాకుండా నేల మీద ఉండేవారట. కానీ రోజురోజుకీ మానవులు మరింత నీచంగా మారారు. ఎక్కువగా అన్యాయాలు చేయడం, అవినీతి పెరగడం, అధర్మంగా ప్రవర్తించడం వంటివి అధికం కావడంతో వీటి మధ్య ఉండలేక దేవతలు కొండపై వెలిశారట. ఈ కారణం వల్ల కూడా దేవుళ్లు, దేవతలు కొండలపై ఎక్కువగా దర్శనమిస్తారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.
ఇవే కారణాలు కాకుండా ఇంకా చాలానే కారణాలు ఉన్నాయి. పర్వతాలు, కొండలపై ఉన్న ఆలయాల దగ్గర ఎలాంటి కాలుష్యంగా ఉండదు. గాలి స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతటి ప్రకృతి మధ్య ఉండటం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా తొలగిపోతుంది. దీనివల్ల దేవుడికి దగ్గరగా ఉంటారట. అలాగే ధ్యానం చేయడానికి అనువుగా ఉంటుందని ఇలా కొండలపై ఆలయాలు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కొండలపై ఉండే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొందరు పూర్తి భక్తితో దేవుడిని పూజిస్తారని ఇలా పర్వతాలపై దేవుళ్లు వెలిశాయని చెప్పుకుంటారు. మన చుట్టూ చూస్తే ఎన్నో ఆలయాలు కొండలపైనే ఎక్కువగా కనిపిస్తాయి. పూర్వం రోజుల్లో కొండలపై ఉండే ఆలయాలకు నడిచి వెళ్లేవారు. ఇలా నడిచి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ రోజుల్లో పక్కనే ఉన్న ఆలయానికి కూడా వాహనాల మీద వెళ్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.