When is Mahashivratri: శివ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఏడాది పాటు శివనామస్మరణ చేయకున్నా కూడా.. మహాశివరాత్రి రోజు శివ పూజలో ఉంటే ఆ భోళా శంకరుడి ఆశీస్సులు పొందవచ్చని అంటూ ఉంటారు. అయితే మహాశివరాత్రి రోజు మాత్రమే శివ పూజ ఎందుకు చేయాలి? ఈరోజు అత్యంత ప్రాధాన్యం ఎందుకు అయింది? మహాశివరాత్రి రోజు పూజ చేయాలంటే ఏ సమయంలో చేయాలి?
ప్రతి ఏడాది మాఘమాసం బహుళ చతుర్దశి రోజునే మహాశివరాత్రి పర్వదినంగా భావిస్తారు. మహా శివుడికి అత్యంత ఇష్టమైన ఈరోజును శివ భక్తులు ఘనంగా జరుపుకుంటారు. 2026 ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఈ రోజున సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం 5.34 గంటలకు ముగుస్తుంది. తిథి ప్రామాణ్యాన్ని అనుసరించి ఈ రోజునే మహాశివరాత్రిని జరుపుకోవాలని అంటున్నారు. మహాశివరాత్రి రోజున శివుడికి పూజ చేసే సమయాన్ని నిశిత కాలం అని అంటారు. అంటే అర్ధరాత్రి సమయం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శివ భక్తులు ఈ రోజున జాగారం పేరిట రాత్రంతా మెలకువతో ఉండి శివ పూజలు చేస్తారు. అయితే ఈ శివరాత్రి రోజున రాత్రి 11.5 గంటల నుంచి 12.56 గంటల వరకు నిషిత కాలంగా పేర్కొంటున్నారు. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేసి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ప్రత్యేక ఫలితం ఉంటుందని అంటున్నారు.
మహాశివరాత్రి పర్వదినం రోజున శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. అందువల్ల గంగాజలం అందుబాటులో లేకపోతే స్వచ్ఛమైన నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. అదేవిధంగా పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అభిషేకం నిర్వహించిన తర్వాత బిల్వ దళాలు, అక్షింతలు, పుష్పాలతో శివార్చన చేయాలి. మహాశివుడికి బిల్వదళం అంటే ఎంతో ఇష్టం. మహాశివరాత్రి రోజున జాగారం, ఉపవాసం ఉండడం భక్తుల ప్రత్యేకత. ఈరోజు రాత్రంతా మెలకువతో ఉండి శివపురాణం, రుద్రాభిషేకం, లింగాష్టకం, శివతాండవ స్తోత్రం వంటి పారాయణం చేస్తుంటారు. ఉపవాసంలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
కొన్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగ రూపంలోకి వచ్చాడని.. అలాగే శివపార్వతుల వివాహం జరిగిందని విశ్వసిస్తారు. ఈ రోజున శివుడుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. భక్తులు ఇళ్లలోనే కాకుండా శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు పాల్గొంటారు. మొత్తంగా ఈ రోజున మహా శివుడి ధ్యానంలో ఉంటూ ఆ స్వామివారి అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఈరోజు మద్యం, మాంసానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే చెడు వాక్యలు చేయకుండా కేవలం శివనామ స్మరణం మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు.