Vangaveeti Radhakrishna: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రజా పోరాటాలకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో చాలామంది నేతలు పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటం చేసే క్రమంలో.. ధైర్యం కూడదీసుకుని కొంతమంది నేతలు ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు మౌనం వీడారు. అలాగే మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ సైతం యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆ ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. అటు తరువాత తమ స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే గత కొంతకాలంగా టిడిపి కూటమి ప్రభుత్వంలో పదవి కోసం వేచి చూస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ. కానీ ఆలస్యం జరుగుతోంది. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
* మంచి స్నేహితులు..
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కొడాలి నాని( Kodali Nani ), వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ మంచి స్నేహితులు. అయితే 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. జగన్ తాను కోరుకున్న సీటు ఇవ్వకపోవడంతో రాధాకృష్ణ టిడిపిలోకి జంప్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రాధాకృష్ణ. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి విడతలోనే రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ 15 నెలలు అవుతోంది.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. పదవి మాత్రం రాలేదు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకెళ్లాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రయత్నించారు. కానీ అప్పట్లో వర్కౌట్ కాలేదు.
* లండన్ పర్యటన తర్వాత బాధ్యతలు..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాజీమంత్రి కొడాలి నాని. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు. ఒకవైపు కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. అలాగే వల్లభనేని వంశీ మోహన్ అయితే చాలా కాలం పాటు జైల్లో ఉండి పోవాల్సి వచ్చింది. ఆయన సైతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవగా.. లండన్ పర్యటన అనంతరం ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు తరువాత హైదరాబాదులోని వంగవీటి రాధాకృష్ణ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి కొడాలి నానితో పాటు వంశీ హాజరయ్యారు. అయితే కుటుంబంలో జరిగిన వేడుకని తెలుస్తోంది. అయితే మున్ముందు కూటమి వంగవీటి రాధా విషయంలో తీసుకునే నిర్ణయాలు బట్టి పరిణామాలు మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?