Vaikuntha Ekadashi : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి( vaikunta Ekadashi ) వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే వైష్ణవ ఆలయాలకు భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ప్రముఖులతో పాటుగా సాధారణ భక్తులు సైతం దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం అయ్యాయి. స్వామివారి ఏకాంత కైంకర్యాలు, అభిషేకాల అనంతరం 3:45 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో దేవదేవుడిని దర్శించుకుంటున్నారు.
* తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమలలో( Tirumala) ఈరోజు నుంచి ఈ నెల 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఇందుకుగాను ప్రత్యేకంగా టోకెన్లు( special tokens ) జారీ చేశారు. ముందుగా ఆన్లైన్లో టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. తరువాత 10,11, 12 తేదీలకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మూడు రోజులపాటు 40000 చొప్పున లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేశారు. 13 తేదీ నుంచి 19 వరకు.. ఏ రోజు కా రోజు కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నారు. అయితే ఈ రోజు నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండడంతో.. ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. ఈరోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులకు 4250 పాసులను మంజూరు చేశారు.
* సింహాచలం దేవస్థానంలో
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో( Simhachalam Devasthanam ) శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం ఐదు గంటలకు భక్తులకు శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
* యాదగిరిగుట్టలో
యాదగిరిగుట్టలో( Yadagirigutta) స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడు రూపంలో స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఈరోజు స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధి నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహ స్వామి ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.