TTD Trust Board : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో భక్తులకు అందించే సౌకర్యాలు, ఆహారం, దేవస్థానాన్ని విస్తరించి ప్రయత్నాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. వాటితో పాటు టీటీడీలో కొత్తగా కొన్ని వ్యవస్థలను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు వీలుగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల కోసం ఆహార భద్రత బోర్డు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వర్గాలు చెప్పాయి.
* నిర్ణయాలను వెల్లడించిన ఈవో
టీటీడీ పాలక మండలి లో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలో తక్కువ ధరకే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తిరుమలలో అన్నప్రసాదానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఈవో వెల్లడించారు. టీటీడీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలపై సమావేశంలో చర్చించామని.. అందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందిస్తామని చెప్పారు ఈవో. స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈవో శ్యామలరావు.
* రెండు వ్యవస్థల ఏర్పాటు
టీటీడీ చరిత్రలోనే మిగిలిపోయేలా రెండు వ్యవస్థలకు ఈ కొత్త ట్రస్టు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. భక్తులకు సేవలకు సంబంధించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఈ డిజిటల్ కార్పొరేషన్ పనిచేయనుంది. తద్వారా వైఫల్యాలను తెలుసుకొని అధిగమించే ప్రయత్నం చేయనుంది. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నెలకొన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో అటువంటి పరిణామాలు జరగకుండా ఆహార భద్రత బోర్డు ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది. అలాగే తిరుపతిలోని కంచి కామకోటి సంప్రదాయ పాఠశాలకు రెండు కోట్ల రూపాయల నిధులు ఇచ్చేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.