Telangana Temples : భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. పురాణాల నుంచి భగవంతుడికి పెద్ద పీట వేసిన దేశం భారతే. ఇక్కడి నుంచే ఆధ్యాత్మికత ప్రపంచం మొత్తం చుట్టింది. రుషులు శాస్త్రవేత్తలుగా మారి ఎంతో జ్ఞానం అందించారు. రాజులు కూడా ఆలయాలకు పెద్ద పీట వేశారు. ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేవారు. దీంతో పాటు ఆలయాలు సత్రాలుగా కూడా ఉన్నాయి. ఎంతో మంది బాటసారులకు ఆశ్రయాలను కల్పించాయి. ప్రసాదం రూపంలో భోజనం అందించేవారు. ఆలయాల్లో పడుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఆనందంగా జీవిస్తారని నమ్మకం కూడా బాగానే ఉండేది. దీంతో పాటు పాఠశాలలుగా కూడా మారాయి. ఇప్పటికీ వేద పాఠశాలలకు నిలయాలు ఆలయాలే. ఇలా ఆలయాలు రాను రాను చరిత్రలో అధిక పాత్రను పోషించాయి. కాలానుగుణంగా వచ్చిన గొప్ప గొప్ప హిందూ రాజులు వీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేశారు. రాజ్యంలో పన్నుల రూపంలో సేకరించిన నగలు, నగదుతో గుడులను కట్టించి వాటి కింద కొంత భూమిని కేటాయించి సేద్యం చేయించి ఆలయం పేరుపై దాన ధర్మాలు చేసేవారు. ఇప్పటికీ ఆలయాల పేరుపై వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని ఇప్పటికీ పేద రైతులకు కౌలుకు ఇస్తారు.
ప్రపంచంలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది. దేశంలో ప్రపంచంలోని లేని ధనం ఆలయాల నుంచి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఎండోమెంట్ పెట్టి దాని కింద సేకరించిన నిధులతోనే సంక్షేమ పథకాలు నడుపుతుంటుంది. దేశంలో ఒక్క ఆలయాలతోనే ఎక్కువ డబ్బులు వస్తున్నట్లు లెక్కలు కూడా చెప్తున్నాయి. ఉదాహరణకు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఏ ఆలయంలో లేని సంపాదన ఆ ఆలయంలో బయటపడింది. రాజులు, పూర్వీకులు ఎంతో మంది నేల మాలిగల్లో బంగారాన్ని పెట్టారని మనకు తెలుస్తుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముడుపులు, ఆలయం ద్వారా సమకూరినవి, హుండీలు, ఇంకా బయట నుంచి ఆలయానికి సమకూరే ఆధాయం అంతా ఇంతా కాదు. సాక్షాత్తు స్వామి వారి సంపాదన ఒక చిన్న దేశాన్ని నడిపించేదిగా ఉంటుంది. వడ్డీ కాసుల వాడి సంపాదన గురించి జగానికి మొత్తం తెలిసిందే.
ఇక తెలంగాణలో ఆలయాలకు కొదువ లేదు చాలానే ఉన్నాయి. వాటిలో దక్షిణ కాశీగా వెలుగొందింది వేములవాడ రాజన్న ఆలయం ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పుకుంటే మాటలు సరిపోవు. ఇక్కడి నుంచి ఎక్కువ ఆదాయం సమకూరిందట. ఇటీవల లెక్కల ప్రకారం.. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో 1,048 కేజీల బంగారం, 38,783 కేజీల వెండి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అధికంగా వేములవాడ రాజన్న ఆలయం 97 కిలోల బంగారం సమకూరింది. ఆ తర్వాత భద్రాచలం (67), యాదగిరి గుట్ట (61) ఉన్నాయి. ఆయా ఆలయాల పరిధిలోనే ఈ బంగారం ఉంటుందని.. కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే ఆలయ అవసరాల కోసం కరిగిస్తామని అధికారులు చెప్తున్నారు.