Sriramanavami: ప్రతీ ఏడాది రామనామస్మరణ మారుమోగే శ్రీరామనవమి రాబోతుంది. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 17న వేడుకలు నిర్వహించుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రముఖ ఆలయమైన భద్రాద్రిలో రామ కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. ఈ తరుణంలో శ్రీరామనవమి గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు చేసుకునే వడపప్పు, పానకం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అసలు శ్రీరామనవమి రోజు వడపప్పు, పానకం ఎందుకు చేస్తారు?
శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణం అంటే ఇంట్లో జరిగే వేడుకలాగే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సీతా, రాములను ముస్తాబు చేసి వారికి తలంబ్రాలు పోసి వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు ఆలయాలకు తరలి వస్తారు. అయితే ఈ వేడుక పూర్తయిన తరువాత ప్రసాదంగా భక్తులకు వడపప్పు, పానకంను పంచిపెడుతుంటారు. ఇది దేవుని ప్రసాదంగా భావించి భక్తులు తీసుకుంటారు. అయితే ఇందులో ఓ ఆరోగ్య రహస్యం ఉంది. అదేంటంటే?
ప్రతీ పండుగకు ప్రత్యేకమైన ప్రసాదం చేస్తుంటారు. అలాగే శ్రీరామనవమి రోజు వడపప్పు, పానం చేస్తుంటారు. వడపప్పు పానకం చేయడానికి శాస్త్రీయ కోణంతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. శ్రీరామ నవమి వేసవి కాలంలో వస్తుంటుంది. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు శరీరానికి కావాల్సిన పదార్థాలు ఇచ్చే క్రమంలో పానకం ను తయారు చేస్తారు. బెల్లంతో తయారు చేసే ఈ పానకం శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మిరియాలు, శొంటి పొడి వేస్తారు. ఇవి జీర్ణ సమస్యను తొలగిస్తాయి.
ఇదే రోజు వడపప్పు ను కూడా ప్రసాదంగా పంచిపెడుతారు. వడపప్పును పెసరపప్పుతో తయారు చేస్తారు. ఇది వేసవిలో తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటారు. పెసరపప్పును నానబెట్టి అందులో నిమ్మరసం కలుపుతారు. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే ఎటువంటి మార్పుల నుంచైనా తట్టుకోగలుగుతారు. అందుకే శ్రీరామ కల్యాణం తిలకించే భక్తుల కోసం ఈ ప్రసాదాన్ని ఇస్తారు.