Bathukamma Special: బతుకమ్మ పండుగ నేటి నుంచి మొదలుకానుంది. మొదటిరోజు ఎగిరి పూలతో బతుకమ్మను మొదలుపెడతారు. సాధారణంగా తెలంగాణ పల్లెల్లో మహిళలు బతుకమ్మను పేర్చి.. ఆడి పాడుతారు. గౌరమ్మను ప్రత్యేకంగా ప్రతిష్టించి.. తంగేడు, గునుగు, కట్ల, చామంతి, విరజాజి, బంతి పూలతో బతుకమ్మను పేర్చి.. అమ్మవారికి పూజలు చేస్తారు. సాయంత్రం పూట రేగడి మట్టి చెరువు నుంచి తెచ్చి.. వెంపలి మొక్కను దాని మీద పెట్టి.. పూజలు చేసి.. బతుకమ్మలను మొత్తం చుట్టూ ఉంచి గౌరమ్మను స్తుతిస్తూ పాటలు పాడుతుంటారు.
పాటలు పూర్తయిన తర్వాత బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత తయారుచేసిన ప్రసాదాన్ని పంచుతారు. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక ఐతిహ్యంగా కొనసాగుతూ వస్తోంది. బతుకమ్మ పాటలు.. గౌరమ్మను కొలిచే విధానం తెలంగాణ సాంస్కృతికి అద్దం పడుతుంది. గౌరమ్మ కేవలం దేవత మాత్రమే కాదని.. నిండైన ఆత్మవిశ్వాసానికి.. మెండైన ధీరత్వానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు. అందువల్లే ప్రతి ఏడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తుంటారని వివరిస్తుంటారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూలతో చేసే వేడుక కాబట్టి.. ఈ పండుగ అతివలకు అమితమైన ఆనందాన్ని ఇస్తుందని చెబుతుంటారు.
సాధారణంగా బతుకమ్మను ఆడవాళ్లు ఆడుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలోని నేతకాని కులస్తులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ బతుకమ్మ పండుగకు బతుకమ్మలను పేర్చరు. దీపావళి రోజు బతుకమ్మ ఆట ఆడుతారు. మగవాళ్ళు బతుకమ్మలను చేతుల్లో పట్టుకుని చెరువు వద్దకు తీసుకెళ్తారు. మగవారు గౌరమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. రేగడి మట్టితో ఎడ్లు చేస్తారు. గురుగులు చేసే దేవుడి ముందు ఫలహారాలు సమర్పిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ కోసం నేతకాని కులస్తులు గ్రామానికి ప్రత్యేకంగా వస్తుంటారు. ఈ పండుగ కోసం ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి వస్తుంటారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తర్వాత మగవారు కోలాటాలు కూడా ఆడుతుంటారు. దీని వెనక అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నేతకాని కులస్తులు చెబుతున్నారు.