Guru Ravidas Jayanti 2025 : మాఘమాసం అనగానే చాలా మందికి శుభదినాలు ఎక్కువగా ఉండే నెల అని అనుకుంటారు. ఈ మాసంలో దాదాపు ప్రతి రోజూ శుభదినంగానే భావిస్తారు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఉంది. ఈరోజు భారత్ లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాఘమాసం పౌర్ణమి రోజున పంజాయ్, హర్యానా రాష్ట్రాలకు సెలవుదినాన్ని ప్రకటించారు. అందుకు కారణంగా ఇదే రోజు గురు రవిదాస్ జయంతిని నిర్వహిస్తారు. గురు రవిదాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు ఈ గురు రవిదాస్ ఎవరు? ఆ రెండు రాష్ట్రాలకు ఎందుకంత ప్రత్యేకత?
దేశంలో ఒకప్పుడు కులతత్వం పాతుకుపోయింది. దీనిని నిర్మూలించడానికి ఎందరో మహానుభావులు పోరాడారు. కొందరు ప్రాణ త్యాగం చేశారు. వీరిలో బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రి బాయి ఫూలె, జ్యోతిరావు ఫూలె వంటి వారి గురించి చెప్పుకుంటాం. అయితే ఉత్తరాదిలోనూ ఈ సమస్య ఉండేది. దీనికి వ్యతిరేకంగా గురు రవిదాస్ పోరాడారు. కబీర్ సమకాలీకుడు అయిన గురు రవిదాస్ సామాజిక సంఘ సంస్కర్తగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. ఇంతకీ ఈయన ఎవరు?
గురు రవిదాస్ ప్రస్తుత వారణాసిలో జన్మించారు. ఆయన భార్య లోనా దేవి. ఈయనకు రోబిదాస్, భగత్ రవిదాస్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన చామర్ వర్గానికి చెందిన వారు. ఈ కారణంగా సమాజంలో ఆయన తల్లిదండ్రులు కొన్ని వర్గాల నుంచి అణచివేయబడ్డారు. అయితే రవిదాస్ మాత్రం గంగానది ఒడ్డున జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే కుల వ్యవస్థను నిర్మూలించడానికి కవిగా మారాడు. తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేసేవారు. ఆయన రచనల వల్ల పంజాబ్, హర్యానాతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ప్రేరణ పొందారు.
గురు రవిదాస్ సిక్కు మతానికి చెందిన వారు. దీంతో సిక్కులు గురురవిదాస్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు రవిదాస్ మాఘమాస పౌర్ణమి రోజు జన్మించారని నమ్ముతారు. దీంతో ప్రతి మాఘమాస పౌర్ణమి రోజున జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2025 ఫిబ్రవరి 12న మాఘమాస పౌర్ణమి సందర్భంగా పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని సెలవుదినాన్ని ప్రకటించాయి. అంతేకాకుండా ఆయన గౌరవ సూచకంగా ఈరోజు మోహాలి, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటించారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నేతాజీ సుభాష్ మార్గ్, సుభాష్ పార్క్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేశారు. ఈ రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గురు రవిదాస్ జయంతిని నిర్వహించనున్నారు.