Ratha Saptami 2026: హిందూ పురాణాల ప్రకారం పండుగ రోజుల్లోనే కాకుండా కొన్ని ప్రత్యేక పర్వదినాలలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అలాంటి పర్వదినాల్లో రథసప్తమి ఒకటి. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున వచ్చే రథసప్తమిని సూర్య జయంతి లేదా ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్ముతారు. ఆ ఏడు గుర్రాలు ఏడు రోజులు, ఏడు రంగులు, ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. రథసప్తమి నుంచి సూర్య కిరణాల్లో తాపం పెరిగి ఉష్ణోగ్రత పెరుగుతుందని అంటారు. ఈరోజు నుంచే ఆరోగ్యానికి శక్తి, వెలుగు ఎక్కువగా ఉంటాయని శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆధ్యాత్మిక ప్రకారం రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయని భావిస్తారు. అలాగే ఈరోజు కొన్ని తప్పులు చేయకుండా కూడా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇంట్లో ఉన్న గంగా జలంతో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుందని అంటారు. ఆ తర్వాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాలను జపిస్తూ ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటి శ్లోకాలను పఠించాలి. ఇవి చదవడం వల్ల శక్తి, శాంతి ఉండడంతోపాటు దైవ ఆనందాన్ని తీసుకువస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున ఇతరులకు దానం చేయడం లేదా సేవ చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. ఈరోజు బియ్యం, తినుబండారాలు, ఫలాలు, వస్త్రాలు ఇతరులకు దానం చేయడం శుభప్రదం అని అంటుంటారు. ఈ రోజున సేవ చేయడం కూడా సబబే అని చెబుతారు. అలాగే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. చాలామంది ఈరోజును ఆధ్యాత్మిక రోజుగా భావించి వ్రతం కూడా ఆచరిస్తారు.
రథసప్తమి రోజున కొన్ని పనులు చేయకుండా నియమాలు పాటించాలి. అబద్ధాలు మాట్లాడడం, ద్వేషంగా ఉండడం, ఇతరులను నష్టపెట్టడం వంటి పనులు చేయవద్దు. అలాగే రాత్రి ఆలస్యంగా పనులను చేయడం వల్ల కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అజీర్ణం కలిగే, ఎక్కువగా మసాలాలు ఉండే ఆహారాలు ఈరోజు తీసుకోకపోవడమే మంచిది. అంతేకాకుండా ఈరోజు అనవసరపు ప్రయాణాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
2026వ సంవత్సరంలో జనవరి 25న రథసప్తమి రాబోతుంది. ఈరోజు నా ఉదయం 05.26 నుంచి 07.13 గంటలోపు స్నానం చేయడం శుభప్రదం. ఈ విధంగా రథసప్తమి రోజున కొన్ని ఆచార వ్యవహారాలు పాటించి ఆరోగ్యకరమైన జీవితం కావాలని కోరుకునేవారు ఈ నియమాలు పాటించడం మంచిది.