Puri Jagannath Rath Yatra 2025: భక్తుల జయ జయ ధ్వానాల నడుమ పూరీ జగన్నాథ రథయాత్ర( jagannadha Rath Yatra ) ప్రారంభం అయింది. దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈరోజు ప్రారంభమైన రథయాత్ర జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ రథయాత్రకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఈ యాత్ర కొనసాగుతున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఏటా ఆషాడ మాసంలో జరిగే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది తొలి రెండు రోజుల్లోనే 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి. దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఒడిస్సా పోలీసులతో సహా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కు చెందిన దాదాపు 8 కంపెనీలు భద్రత బాధ్యతను చూస్తున్నాయి. నిఘా కోసం పోలీసులు పూరీ పట్టణంలో 250 కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అమర్చారు.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
* పహాల్గం దాడి నేపథ్యంలో..
ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో( Pahalgam) ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన నేపథ్యంలో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఊరిలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రథయాత్ర భద్రత కోసం ప్రత్యేకంగా భవనాలపై ఎన్ఎస్జి కమాండోలు మోహరించారు. ఒడిస్సా లోని సముద్ర తీరంలోనూ భద్రత పెంచారు. ఒడిస్సా మెరైన్ పోలీసులు, భారత నావికాదళం సంయుక్తంగా రంగంలోకి దిగింది. భద్రతా వలయం మధ్య పూరీ జగన్నాధుడి రథయాత్ర నేత్రపర్వంగా జరగనుంది.
* భారీ అంచనాల నేపథ్యంలో..
రథయాత్ర మొదటి రెండు రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు( devotees ) పాల్గొంటారని ఒడిస్సా ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. పార్కింగ్ లభ్యత, రూట్ మ్యాప్ లు, పార్కింగ్ స్థలాల గురించి భక్తులకు తెలుసుకునేందుకు రియల్ టైం చాట్ బాట్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చారు. కీలక ప్రదేశాల్లో సబ్ కంట్రోల్ రూమ్లు సైతం కొనసాగుతున్నాయి. అత్యంత భద్రత నడుమ జగన్నాధుడి రథయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తోంది. అటు ఒడిస్సా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం జగన్నాథుడి రథయాత్ర అత్యంత వేడుకగా ప్రారంభం అయింది. జగన్నాథ స్వామి జూలై 8 వరకు రోజుకో రీతిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.