Kumbh Mela 2025: హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్(Prayag raj)లో అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 13 నుంచి 45 రోజులపాటు జాతర జరుగనుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశానికి భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం(జనవరి 13)న తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ప్రయాగ్‌రాజ్ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7:30 గంటల వరకే సుమారు 35 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు.
45 రోజులు వేడుక..
మహాకుంభమేళా 45 రోజులపాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈసారి 35 కోట్ల మంది వస్తారని, పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈమేరకు మెరుగైన సౌకర్యాలతోపాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతర పహారా కోసం తేలియాడే పోలీస్ స్టేషన్(Floting Police station) ఏర్పాటు చేశారు. చిన్నచిన్న పడవలపై పోలీస్ సిబ్బంది నదిలో పెట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రధాని సందేశం…
ఇక మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా సందేశం ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. భారతీయ విలువు, సంస్కృతిని గౌరవించే కోట్ల మందికి ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చే వేడుక. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు కోట్ల మంది రావడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.
10 వేళ ఎకరాల్లో ఏర్పాట్లు..
ఇక మహా కుంభమేళా కోసం యూపీ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. సుమారు 10 వేల ఎకరాల్లో 50 లక్షల నుంచి కోటమంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించారు. సీఎం యోగి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించి 13 అఖండాలు కుంభమేళాలో భాగం కానున్నాయి.