Konark Sun Temple: ఆధ్యాత్మికతకు, దైవ భక్తికి పుట్టినిల్లు భారత దేశం. వందల ఏళ్లుగా హిందుత్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఆలయాలు నిర్మించారు. అయితే తర్వాత జరిగిన యుద్ధాలు, పరాయి పాలన, దండయాత్రలతో చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఇక కొన్ని ఆలయాలు దశాబ్దాలుగా మూతబడే ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో కోణార్క్ సూర్య దేవాలయ గర్భగుడి కూడా ఒకటి. 122 సంవత్సరాల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. భారత పురావస్తు శాఖ 2025 డిసెంబర్‌లో ఇసుక తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది.
మూసివేతకు కారణాలు
13వ శతాబ్దంలో నరసింహదేవుడు నిర్మించిన కోనార్క్ సూర్యదేవాలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే స్మారకం 1903లో బలహీనపడింది. రాళ్లు ఊడిపడటం, గోడలు పగిలే పరిస్థితిలో ఉన్నట్లు అప్పటి బ్రిటిష్ అధికారులు గుర్తించారు. దీంతో లోపలికి భక్తులు వెళ్లకుండా గర్భగుడిని నదీ ఇసుకతో నింపి ద్వారాలు సీల్ చేశారు. ఇది కట్టడాన్ని లోపలి నుంచి బలంగా చేసింది.
తాజాగా తెవడానికి ప్రయత్నాలు..
అయితే 1903లో నింపిన ఇసుక ఇప్పుడు 15 నుంచి 17 అడుగుల కిందకు కుంగిపోయింది. దీంతో ఖాళీ ఏర్పడింది. మళ్లీ ఆలయ గోడలు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. లేజర్ స్కానింగ్, ఎండోస్కోపీ పరిశోధనలతో స్టీల్ సపోర్ట్ అవసరం అని ఇంజినీర్లు గుర్తించారు. దీంతో స్టీల్ సపోర్టు ఏర్పడు చేయడానికి పశ్చిమ ద్వారం గుండా ఇసుకను మెల్లగా తొలగిస్తున్నారు. పూర్తిగా తొలగించడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
గర్భగుడిలో ఏముంది..
సూర్యదేవాలయం గర్భగుడిలో అద్భుతమైన చెక్కడాలు ఉన్నాయి. నృత్యకారులు, దేవతల శిల్పాలు, 10 అడుగుల క్లోరైట్ సూర్య విగ్రహం ఉండే అవకాశం ఉంది. కళింగ శైలి రాతి స్తంభాలు, సంగీత స్తంభాలు (ఏడు స్వరాలు పలుకుతాయి) ప్రత్యేకం. ఇవి ధ్వని శాస్త్రం, లోహాంశాలతో రూపొందించారు.
Also Read: ఢిల్లీలో ఆలయాల పేల్చివేతకు కుట్ర.. తీగ లాగితే డొంక కదిలింది!
ఖగోళ గడియారం రహస్యం
సూర్య రథ ఆకారంలో 24 చక్రాలు(రోజు గంటలు), 7 గుర్రాలు (వారం రోజులు) ఉన్నాయి. చక్రాలు సన్‌డయల్‌గా పనిచేసి నిమిషాల కచ్చితత్వంతో సమయం చెబుతాయి. ప్రధాన ఆకులు 3 గంటలు, చిన్న గీతలు 3 నిమిషాలు సూచిస్తాయి. సూర్యోదయ కిరణాలు గర్భగుడి విగ్రహ పాదాలపై పడేలా డిజైన్ ఉంది.
అయస్కాంత శక్తి..
ఇక కోణార్క్ ఆలయ శిఖరంపై 52 టన్నుల అయస్కాంతం ఏర్పాటు చేశారు. దీని ప్రభావంతో విగ్రహం తేలేదని, నౌకల కంపాస్‌లు దెబ్బతిన్నాయని పురాణాలు. చెబుతున్నాయి. దాని తొలగింపు తర్వాత ఐరన్ ప్లేట్ల సమతుల్యత దెబ్బతింటూ కూలినట్లు వాదనలు ఉన్నాయి. 1200 మంది శిల్పులు 12 సంవత్సరాలు పని చేసినా శిఖర రాయి అమర్చలేకపోయారు. బిష్వ మహారాణా కుమారుడు 12 ఏళ్ల ధర్మపదుడు లోపాన్ని సరిచేసి పూర్తి చేశాడు. శిల్పుల పరువు కాపాడటానికి సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేశాడు. ఈ కారణంగా ఆలయంలో పూజలు ఆగాయన్న ప్రచారం కూడా ఉంది.
మొత్తానికి 122 ఏళ్ల తర్వాత ఆలయ గర్భగుడి తలుపులు తెరిచే పనులు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరగితే మరి కొన్ని రోజుల్లోనే గర్భగుడి తెరుచుకుంటుంది. మరిన్ని ఆలయ రహస్యాలు వెలుగు చూసే అవకాశం ఉంది.