https://oktelugu.com/

Temple : కాలాన్ని బట్టి మారుతుందట.. కలియుగంతానికి సంకేతమట.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

కాలాన్ని బట్టి ఈ ఆలయం మారుతుంది. వేసవిలో చల్లగా ఉంటుంది. శీతాకాలంలో వేడిగా ఉంటుంది.. అంతే కాదు ఈ ఆలయం కలియుగాంతాన్ని సూచిస్తుందట. అందువల్లే ఈ ఆలయం మిగతా ఆలయాలతో పోల్చితే భిన్నంగా ఉంటుందట. ఇంతకీ దీని నేపథ్యం ఏమిటో తెలుసా?!

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 12:27 PM IST

    Kedareshwara cave temple

    Follow us on

    Temple :  మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు. చారిత్రక ప్రాశస్త్యాన్ని వెల్లడించే ఎన్నో ఆలయాలు మనదేశంలో ఉన్నాయి. అందువల్లే మన దేశం మిగతా దేశాలతో పోల్చి చూస్తే భిన్నంగా కనిపిస్తుంది.. సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు వైవిధ్యంగా కనిపిస్తాయి. మనదేశమే కాదు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, జపాన్, ఇండోనేషియా, ఐర్లాండ్ దేశాలలో దేవుళ్ళకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. కాకపోతే ఆ దేశాలతో పోల్చితే మన దేశంలో సంస్కృతి గొప్పగా ఉంటుంది. అందువల్లే మనదేశంలో ఆలయాలు గొప్పగా విలసిల్లుతున్నాయి. ఇలాంటి ఆలయాలలో పురాతనమైన చరిత్ర ఉన్న కోవెల ఒకటి ఉంది. అది మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రపంచం అంతాన్ని చెబుతుందని చరిత్రకారులు, ప్రజలు విశ్వసిస్తుంటారు.. ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి దీనిని ఇతర ఆలయాలతో భిన్నంగా పోల్చి చూపిస్తున్నాయి.

    ఎక్కడ ఉందంటే

    ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా హరిచంద్ర గడ్ అనే కోటలో ఉంది.. దీనిని కేదారేశ్వర గుహ దేవాలయం అని పిలుస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత రహస్యంగా ఉంటుంది.. వాస్తవానికి ఒక నిర్మాణాన్ని నిర్మించాలంటే నాలుగు స్తంభాలను ఏర్పాటు చేయాలి. అయితే ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుంచి ఒకే స్తంభంపై నిలబడి ఉంటున్నది. ఈ ఆలయాన్ని కలచూరి వంశస్థులు నిర్మించారు. ఆరవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని తెలుస్తోంది. అయితే ఈ ఆలయానికి సంబంధించిన గుహలు 11వ శతాబ్దంలో చరిత్రకారుల పరిశోధనలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీక అని భక్తులు నమ్ముతుంటారు.. ప్రస్తుతం ఒక్క స్తంభం మీద మాత్రమే ఆలయ నిర్మాణం అనుసంధానించి ఉంది. మిగతా మూడు స్తంభాలు ఎప్పుడో ధ్వంసం అయిపోయాయి. అయితే ఈ నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీక అని భక్తులు నమ్ముతుంటారు. ఈ నాలుగు స్తంభాలను సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలుగా నమ్ముతుంటారు. ఇప్పటికే సత్య, త్రేతా, ద్వాపర యుగాలు ముగిసిపోయాయని.. ప్రస్తుతం కలియుగం సాగుతోందని.. ఆ యుగానికి ప్రతీకగా ఒకటే స్తంభం మీద ఈ ఆలయం నిలబడి ఉందని భక్తులు నమ్ముతుంటారు. ఒకవేళ చివరి స్తంభం గనుక విరిగిపోతే కలియుగం అంతమవుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.. అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభాలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.

    సహజ సిద్ధంగా శివలింగం

    ఈ ఆలయంలో శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ గుడి గుహలో మంచును తలపించే విధంగా చల్లని నీరు ఉంటుంది. దాని మధ్యలో ఐదు అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది. వేసవిలో ఈ గుహలో నీరు గడ్డ కడుతుంది.. శీతకాలంలో గోరువెచ్చగా ఉంటుంది.. అయితే ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.

    నోట్: ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం వివిధ వేదికల వద్ద సేకరించాం. అయితే వీటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని పాఠకులు గమనించాలని కోరుతున్నాం.