https://oktelugu.com/

Jagannath Bhandagar: మధ్యాహ్నం జగన్నాథుడి భాండాగారం తెరిచారు.. సాయంత్రానికి వచ్చారు.. కమిటీ సభ్యుల పరిశీలనలో ఏం తేలింది?

మధ్యాహ్నం రత్న భాండాగారంలోకి కమిటీ సభ్యులు వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది బయటి ప్రపంచానికి తెలియ రాలేదు. ఆ సమయంలో చుట్టు కట్టుదిట్టమైన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. రత్న భాండాగారం లో విష సర్పాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. స్నేక్ టీం సభ్యులను అందుబాటులో ఉంచారు

Written By:
  • Bhaskar
  • , Updated On : July 15, 2024 / 08:35 AM IST
    Follow us on

    Jagannath Bhandagar : ఒడిశాలోని సుప్రసిద్ధ పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన రత్న భాండాగారం దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం తెరుచుకుంది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం.. వాటిని సుప్రీంకోర్టు సమర్ధించడంతో.. బిజెపి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.. ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్నాధుడి ఆలయం లోపలికి ప్రవేశించారు. అక్కడ అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు..”స్వామీ తమరి రత్న భాండాగారం తెరుస్తున్నాం. నాలుగు దశాబ్దాల తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎటువంటి ఆటంకాలు దరిచేరకుండా చూడాలంటూ” వేడుకున్నారు. ఆ తర్వాత అర్చకులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:28 నిమిషాలకు రత్న భాండాగారంగా పిలుస్తున్న రహస్య గది తాళాలను తాళం చెవిలతో తీసేందుకు ప్రయత్నించగా అవాంతరం ఏర్పడింది.

    తాళం చెవిలను ధ్వంసం చేశారు

    మధ్యాహ్నం రత్న భాండాగారంలోకి కమిటీ సభ్యులు వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది బయటి ప్రపంచానికి తెలియ రాలేదు. ఆ సమయంలో చుట్టు కట్టుదిట్టమైన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. రత్న భాండాగారం లో విష సర్పాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. స్నేక్ టీం సభ్యులను అందుబాటులో ఉంచారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు వారిని రత్న భాండాగారం వెలుపల ఉంచారు.. లోపల ఏం జరిగిందనే విషయాన్ని బయటకు తప్పకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల తర్వాత వారు బయటకు వచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం, జాతీయ మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం కమిటీ సభ్యులు రత్న భాండాగారం లోపలికి వెళ్లి చూడగా.. ఆ గదికి మూడు తాళాలు ఉన్నాయి. జిల్లా అధికారుల వద్ద మూడు తాళం చెవిలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో అవేవీ పని చేయలేదు. మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం కమిటీ సభ్యులు ఆ మూడు తాళాలను ధ్వంసం చేశారు. అనంతరం రత్న భాండాగారం లోపలికి వెళ్లారు. ఆ గదిలో ఉన్న బీరువా, చెక్క పెట్టెలో భద్రపరచిన ఆభరణాలను పరిశీలించారు. అవన్నీ కూడా విలువైన వస్తువులు కావడంతో ఒకేసారి తరలించాలని, అందుకు కాస్త సమయం పడుతుందని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల నుంచి మార్గదర్శకాలు విడుదల కావడంతో రత్న భాండాగారానికి పూరి ఆలయ ప్రధాన అధికారి అరవింద పాడి ఆధ్వర్యంలో సీల్ వేశారు.

    అప్పట్లో 70 రోజులు పట్టింది

    బహుదా యాత్ర ముగిసిన తర్వాత, సునవేష పూజలు పూర్తి చేసుకున్న అనంతరం రత్న భాండాగారం లోపల ఉన్న విలువైన ఆభరణాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ నియమించిన కమిటీ సభ్యులు అంటున్నారు. రత్న భాండాగారాన్ని పురావస్తు శాఖ అధికారులు కూడా పూర్తిగా పరిశీలించారు. “ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీ రత్న భాండాగారాన్ని పూర్తిగా పరిశీలించింది. బీరువా, చెక్క పెట్టెలో భద్రపరచిన ఆభరణాల పరిశీలన ప్రక్రియ పూర్తికావడానికి సమయం పడుతుంది. వాస్తవానికి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం లేదు. స్వర్ణకారులు, ఇతర నిపుణులతో సంప్రదింపులు జరుపుతాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. రత్న భాండాగారం మరమతుల పూర్తయిన తర్వాత స్వామివారి ఆభరణాలను తిరిగి అక్కడే భద్రపరుస్తాం. ఆ తర్వాత తుది జాబితాను రూపొందిస్తాం. ఈ ఆభరణాలను తరలించేందుకు ప్రత్యేకంగా టేకు కలపతో తయారుచేసిన ఆరు చెక్క పెట్టెలను తయారు చేసి ఉంచాం. సరిగ్గా 1978లో స్వామివారి ఆభరణాల జాబితా సిద్ధం చేసేందుకు ఏకంగా 70 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం.. కాకపోతే ఈసారి లెక్కింపును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని”ప్రభుత్వ నియమించిన కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు పేర్కొన్నారు.