అమావాస్య అనగానే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది. ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడానికి ముందుకు రారు. అమావాస్య ముందు, వెనుక రోజుల్లో కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించారు. కానీ ఓ ఆలయంలో అమావాస్య రోజున పూజలు చేయడం వల్ల దరిద్రాలు మాయమవుతాయని కొందరు భక్తులు పేర్కొంటున్నారు. అమావాస్య రోజునే కాకుండా పౌర్ణమి, అష్టమి రోజుల్లో ఇక్కడ పూజలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, యమగండాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే?
కాకతీయుల రాజ్య కేంద్రమైన ఓరుగల్లుకు ఎంతో చరిత్ర ఉంది. వారి కాలంలో అనేక ఆలయాలు నిర్మించారు. పలు ప్రముఖ ఆలయాలకే కేంద్రంగా ఉన్న వరంగల్ నగరంలో 1500 సంవత్సరాల కిందట ఓ ఆలయాన్ని నిర్మించారు. అదే కాలబైరవుడి ఆలయం. నగరంలోని గోవిందరాజుల గుట్ట కింద ఆ స్వామి క్షేత్ర పాలకుడిగా కాలబైరవుడు వెలిశాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉండడంతో పాటు భక్తుల బాధలు తీర్చే క్షేత్రంగా మారిందని స్థానికులు అంటున్నారు.
కాలబైరవుడికి ప్రతీ అమావాస్య, అష్టమి, పౌర్ణమి రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజుల్లో ఆ స్వామిని పూజించడం వల్ల అనేక బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ స్వామివారికి గుమ్మడి కాయతో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు. అలాగే యమగండం నుంచి కూడా గట్టెక్కవచ్చని చెబుతున్నారు. వరంగల్ నగరంలోనే ఈ ఆలయం ఉండడం వల్ల ఇక్కడికి వెళ్లడానికి పెద్ద సమస్య ఉండదన చెబుతున్నారు. ఈ ఆయలంలో కాలబైరవుడితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మావార్లు కొలువై ఉన్నారు.