Ganesh Chaturthi 2024: ఆఖరుకు ఆప్ఘనిస్తాన్ లో వినాయక వేడుకలు.. ఏ దేశంలో ఎలా చేస్తున్నారంటే?

వినాయక చవితి అంటేనే అందరూ ఘనంగా జరుపుకునే పండుగా. ఆది దేవుడిని 9 రోజులు ఘనంగా పూజించే వేడుక. ఈ వేడుక కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. అందరూ ఎదురు చూస్తున్న పండుగ వచ్చింది. నేడు(సెప్టెంబర్‌ 7న) వినాయక చవితి. ప్రపంచ వ్యాప్తంగా చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 7, 2024 4:43 pm

Ganesh Chaturthi 2024(1)

Follow us on

Ganesh Chaturthi 2024: పండుగలు ప్రజల సంస్కృతికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. ఏ కులమైనా, మతమైనా.. వారి సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతాయి. కొన్ని పండుగలు గిరిజనులు జరుపుకుంటే.. కొన్ని పండుగలు హిందువులు,కొన్ని ముసిలలు, కొన్ని క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ పండుగలు కొన్ని దేశాల్లోనే జరుపుకుంటారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ మన వినాయక చవితి. నేడు వినాయక చవితి సందర్భంగా విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్‌ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ఏటా వినియక చవితి పండుగ జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు, వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. ఏ దేశం.. ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం..

థాయ్‌లాండ్‌లో..
థాయ్‌లాండ్‌ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయ్‌లాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. మన గణనాథుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్‌ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గణపతి ఆలయాలు థాయ్‌లాండ్‌ వ్యాప్తంగా ఉన్నాయి.

టిబెట్‌లో..
టిబెట్‌లోనూ మన గణనాథుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహరక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్‌ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్‌ దేవతల మాదిరిగా కోపం కొట్టొచ్చినట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి.

ఇండోనేసియాలో..
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవుడిగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గార్‌ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచ్చింది. అగ్నిపర్వతాల విస్పోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.

చైనా, అఫ్ఘనిస్తాన్‌లో…
చైనాలో లంబోదరుడిని ’హువాంగ్‌ సీ టియాన్‌’ అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ సమీపంలోని గార్డెజ్‌ క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయక విగ్రహం బయల్పడింది. గార్డెజ్‌ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు.

జపాన్‌లో..
గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్లు నటులు, గీషాలుగా పిలవబడే కళాకారిణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకుని ఉంటాయి. జపనీస్‌ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.

ఉంగాండాలో..
ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో గణేశ్‌ చతుర్థి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్కడి సంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథునికి స్వాగతం పలికిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంబోడియాలో
కంబోడియాలో గణాదీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు.