woman Aghori : అఘోరా.. లేదా నాగసాదు.. అనగానే ఒళ్లంతా విబూది పూసుకుని, జడలు కట్టిన జుట్టు.. మెడలో రుద్రాక్షలు.. చేతిలో కమండలం.. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కనిపిస్తారు. వీరు ఎక్కువగా కాశీ, హరిద్వార్ క్షేత్రాల్లో ఎక్కువగా ఉంటారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కనిపించరు. నిత్యం శివధ్యానంలోనే గడుపుతారు. కుంభ మేళాలు, శివరాత్రి వేళల్లో ప్రత్యేకమైన శైవ క్షేత్రాల్లో దర్శనమిస్తారు. అఘోరాలు శ్మశానాల్లో పూజలు చేస్తారని, నరమాంసం భక్షిస్తారన్న ప్రచారం కూడా ఉంది. మంత్ర, తంత్ర, యంత్ర విద్యలు తెలిసినవారిగా భావిస్తారు. అందుకే వారిని చూడగానే చాటా మంది భయంతో, భక్తితో ప్రణమిల్లుతారు. తమకు తెలియకుండానే.. అందరిలో భక్తిభావం పెరుగుతుంది. అయితే తెలంగాణలో.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కొన్ని రోజులుగా మహిళా అఘోరి హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లిలో మొదట కనిపించారు. భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కారులో వచ్చిన మహిళా నాగసాధు.. కొమురవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా అదే నాగసాధువు.. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో కనిపించారు. నాగ సాధువు సందర్శించిన రోజుకూ ఓ ప్రత్యేకత ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కారుపై ఎర్రటి అక్షరాలతో..
డేంజర్.. అఘోరీ.. నాగసాధు అని ఎర్రటి అక్రరాలతో రాసిన ఓ కారు సెప్టెంబర్ 11న జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి దూసుకు వచ్చింది. దానిని చూడగానే భక్తులు లోపల ఎవరు ఉన్నారన్న ఆసక్తి నెలకొంది. వెంటనే కారులో నుంచి మహిళా అఘోరి దిగారు. దీంతో వెంటనే అక్కడున్నవారు హడలిపోయారు. చేతులు జోడించి నమస్కరించారు. తర్వాత అఘోరీ ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. సాధారణంగా శైవ క్షేత్రాలకు మాత్రమే వెళ్లే నాగసాధువు.. కొండగట్టుకు రావడం.. పూజలు చేయడంపై స్థానికులు ఆందోళన చెందారు.
లోక కల్యాణం కోసమే..
తర్వాత ఆలయం బయటకు వచ్చిన అఘోరి.. మాట్లాడుతూ లోక కల్యాణార్థం తాను ఆలయాల సందర్శన చేస్తున్నట్లు తెలిపారు. హరిద్వారార్ నుంచి యాత్ర ప్రారంభించానని పేర్కొన్నారు. లె లంగాణలోని అన్ని ఆలయాలను సందర్శిస్తానని వెల్లడించారు. అనంతరం అఘోరి వెంట వచ్చిన వారు.. శ్మశానం వద్ద పూజలు చేసిన ఓ వీడియోను మీడియాకు ఇచ్చారు. అందులో నాగసాధువు శ్మశానంలో అప్పుడే అంటించిన చితి చుట్టూ అఘోరీ ప్రదక్షిణ చేయడం కనిపించింది. చితికి ఇరువైపులా పూజలు చేశారు. చితి కింది నుంచి బూడిద తీసి ఒంటికి రాసుకున్నారు. ఆకాశంలోకి మట్టి, బూడిద విసురుతూ పూజలు చేశారు.
ఆరోజు రావడంతో ఆందోళన..
ఇదిలా ఉంటే.. నాగసాధవు… కొండగట్టులో ఐదేళ్ల క్రితం ఘోర ప్రమాదం జరిగిన తేదీనే.. అదే క్షేత్రానికి రావడం ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చర్చనీయాంశమైంది. 2019, సెప్టెంబర్ 11న కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 65 మంది దుర్మరణం చెందారు. 2024, సెప్టెంబర్ 11న నాగసాధువు కొండగట్టుకు రావడం వెనుక ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు.