Temple : కృష్ణుడిని పూజించినట్టు.. అర్జునుడిని ఆరాధించినట్టు.. దుర్యోధనుడుని హిందువులు పూజించరు. కనీసం గుడి కూడా కట్టరు. పొరపాటున కూడా మదిలో తలవరు. అయితే అలాంటి వ్యక్తికి ఓ గుడి ఉంది. విశేషమైన భర్తగణం ఉంది. ప్రతి ఏడాది అతడికి ఉత్సవం కూడా జరుగుతుంది.. మనదేశంలోని కేరళ రాష్ట్రంలో మలనాథ ప్రాంతంలో దుర్యోధనుడికి ఆలయం ఉంది.. ఇక్కడ ఉన్న ఓ కొండపై ఆలయాన్ని నిర్మించారు. దుర్యోధనుడు మాత్రమే కాదు అతని తోడబుట్టిన 99 మంది తమ్ముళ్లకు, కర్ణుడికి ఆలయాలు నిర్మించారు. కొల్లం జిల్లాలో ఇవి కనిపిస్తాయి. వీరికి మాత్రమే కాదు సుయోధనుడి సోదరీమణి దుస్సలకు కూడా గుడి ఉంది. అయితే ఇక్కడ విగ్రహాలు కనిపించవు. కేవలం రాతి మంటపం మాత్రమే దర్శనమిస్తుంది. హైందవ ఆలయాల్లో గర్భాలయంలో మూలవిరాట్ ఉంటుంది. కానీ దుర్యోధనుడికి ఎటువంటి విగ్రహం ఉండదు. మంటపం ఎదుట కూర్చుని దుర్యోధనుడి సాహాసలను కీర్తిస్తూ.. పూజలు చేస్తుంటారు. దుర్యోధనుడి పరివారాన్ని తలచుకుంటూ యజ్ఞం నిర్వహిస్తారు. ” మాకు భూమి ఇచ్చాడు. మా తాత ముత్తాతలు స్ఫూర్తినింపాడు. అతని వల్లే మాకు ఆస్తి నిలిచింది. అతడి అనుగ్రహమే మమ్మల్ని ఇంత వాళ్లను చేసిందని” మలనాద ప్రజలు నమ్ముతుంటారు. అందువల్లే నేటికి కూడా దుర్యోధనుడు ద్వారా పొందిన ఆస్తికి పన్ను చెల్లిస్తుంటారు. కాకపోతే దానిని ఆలయానికి ఇస్తుంటారు.
ప్రతీ ఏటా వేడుకలు
కేరళ రాష్ట్రంలో కురవ సామాజిక వర్గానికి చెందినవారు చాలామంది ఉంటారు. కౌరవులను తమ వర్గానికి చెందిన వారేనని వీరు నమ్ముతుంటారు. తమ సామాజిక వర్గానికి చెందిన పూర్వీకుడు అప్పోప్పన్ ను ఆరాధిస్తుంటారు. కౌరవులను కూడా పూజిస్తుంటారు.. మలయాళం ప్రజలు మీనమాసంగా చెప్పుకునే మార్చి ఏప్రిల్ నెలలో దుర్యోధనుడి ఆలయానికి వార్షికోత్సవం నిర్వహిస్తారు. సుయోధనుడి స్మారకాన్ని పూలతో అలంకరించి మొక్కలు చెల్లించుకుంటారు.. ఆ తర్వాత వంటలు వండుకొని అక్కడే భుజిస్తారు. అయితే వార్షికోత్సవంలో పొరపాటున కూడా మాంసాహారం ముట్టరు. మద్యం తాగరు. కేవలం తీపి పదార్థాలు, మలయాళ సాంప్రదాయ విధానంలో తయారుచేసిన వంటలను మాత్రమే వండి.. ఆ ఆహార పదార్థాలను భుజిస్తారు. ఆరోజు అన్నదానం కూడా చేస్తారు. “దుర్యోధనుడు ఇతరులకు రాక్షసుడు. మాకు మాత్రం దేవుడు. మాకు భూములు ఇచ్చాడు. గొప్పగా బతికే అవకాశం ఇచ్చాడు. అన్నింటికీ మించి తరతరాలుగా అచంచలమైన ధైర్యాన్ని ఇచ్చాడు. అతడి స్ఫూర్తి మాలో ఉంటుంది. అతడు చూపించిన తోవ మాకు ఎల్లకాలం బతుకునిస్తుందని” కురవ సామాజిక వర్గం వారు చెబుతుంటారు.