TTD Darshan Tickets : అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుమలలో సైతం భక్తుల రద్దీ తగ్గింది. ముసురు వాతావరణంతో భక్తుల తాకిడి తగ్గినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం సమీపిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు టీటీడీ ఉంది. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించనున్నారు. లక్షలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టిక్కెట్ల జారీ తేదీలను కూడా టీటీడీ ఇదివరకే విడుదల చేసింది.అయితే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు..టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి తేదీలను మార్చింది టీటీడీ. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
* ముందే షెడ్యూల్ ప్రకటన
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లతో పాటు మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి కోటా, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల తేదీలు కలిసి ప్రకటించారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. శ్రీ వాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటా ఈనెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పారు. మార్చిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల24న ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టిక్కెట్లను కూడా డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు,ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సి ఉంది.కానీ ఒకే సమయంలో రెండు రకాల టిక్కెట్ల జారీ గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే టీటీడీ అధికారులు మార్పులు చేస్తూ టికెట్ల జారీ ప్రక్రియను ప్రకటించారు.
* ఈ తేదీల్లో టిక్కెట్ల జారీ
ఈనెల 25 ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీ వాణి టిక్కెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమల లోని వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచుతారు. ఈ మార్పును గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు. టీటీడీ అధికార వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.