https://oktelugu.com/

Bodemma celebrations : పల్లెల నుంచి పట్టణాలకు పాకిన బొడ్డెమ్మ సంబరాలు

మహిళలు, యువతులు, చిన్నారులు సంతోషంగా బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఆడుకుంటారు. . ముఖ్యంగా చిన్నారులు ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2024 / 09:10 PM IST

    Bodemma celebrations

    Follow us on

    ‘ రూపాయి వెలవెల వేద్దామా..

    ఎవ్వరి చేతులో వేద్దామా..
    కృష్ణమూర్తి చేతులో వేద్దామా..
    ఎవ్వరిని చూద్దామా.. గౌరమ్మను చూద్దామా ‘ అంటూ బొడ్డెమ్మ వేడుకలు మొదయ్యాయి.

    ప్రకృతిని ఆరాధించే పండుగల్లో ఒకటైన ఈ వేడుకలు గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఎల్లలు దాటింది. జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానుల్లోనే కాకుండా విదేశాలకు కూడా పాకింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంత వాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

    భాద్రపద మాసంలో వినాయక నిమజ్జనం అనంతరం బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. గోధూళి వేళలో ఆడబిడ్డలందరూ ఒకేచోట చేరి సందడి చేస్తారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఆడిపాడుతారు. మట్టితో శ్రీచక్రం రూపంలో మలచిన సింహాసనంపై పసుపు ముద్ద తో గౌరమ్మను ఒక చౌరంగి మధ్యలో ప్రతిష్టిస్తారు. తొమ్మిది రోజుల పాటు చిన్నారులు, యువతులు ఎవరికివారే అందంగా ముగ్గులతో అలంకరించిన చతుర్భుజి ఆకారంలో ఉన్న మట్టి గద్దెలను గౌరమ్మ చుట్టూ ఉంచి, వాటిపై దీపాలను వెలిగించి అమ్మవారిని పూలు, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ఆ తరువాత అమ్మవారిని కీర్తిస్తూ చప్పట్లు కొడుతూ, ప్రత్యకమైన పాటలు పాడుతూ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. పాటల్లో సైతం ఆడే పిల్లల పేర్లు వచ్చేలా జోడించి ఆట పాటలతో సందడి చేస్తారు. చివరి రోజు జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.

    Bodemma celebrations

    పెద్దల పండుగగా బతుకమ్మ, పిల్లలకు సంబంధించిన పండుగగా బొడ్డెమ్మను చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ప్రతీ గ్రామంలోనూ ఈ సందడి కనిపిస్తుంది. గ్రామాల్లో, బొడ్డెమ్మల సందడి కనిపిస్తున్నది. గౌరీదేవి రూపంగా పూజించే బొడ్డెమ్మను నాలుగు రకాలుగా కొలుస్తారు. వాటికి పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ అంటూ పేర్లు పెడుతారు.

    మహిళలు, యువతులు, చిన్నారులు సంతోషంగా బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఆడుకుంటారు. . ముఖ్యంగా చిన్నారులు ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు. బతుకమ్మ పండుగకు ఒకరోజు ముందు వరకు ఈ వేడుకలు సంబరంగా చేస్తారు.

    -దహగాం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్