Bhogi Pallu: దక్షిణ భారత దేశంలో (India) ఎక్కువగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి (Sankranthi) అతిపెద్దది. ఎంత దూరం ఉన్నా కూడా ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే అందరూ కూడా షాపింగ్ (Shopping) అంటూ మొదలు పెడతారు. ఎన్ని పనులు ఉన్నా కూడా సంక్రాంతికి తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో (Family Members) ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగితో ప్రారంభించి కనుమతో ముగిస్తారు. అయితే భోగి రోజు మంట వేసి పాత వస్తువులను ఆ మంటలో వేసేస్తారు. కష్టాలన్నీ ఆ భోగి మంటలో కలిసి పోయి.. ఇకపై అంతా మంచి జరగాలని కోరుకుంటారు. ఈ భోగి (Bhogi) రోజు సాయంత్రం సమయాల్లో పిల్లలకు భోగి పళ్లు (Bhogi Pallu)పోస్తారు. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
భోగి పండుగ రోజు ఉదయం మంటలు వేస్తారు. దీని చుట్టూ అందరూ కూడా సరదాగా ఆట పాటలతో సందడి చేస్తారు. సాయంత్రం సమయాల్లో భోగి పళ్లు పిల్లలకు పోస్తారు. భోగి పళ్లు అంటే పిల్లలకు పేరంటం చేసి వారి మీద రేగు పళ్లు పోస్తారు. వీటినే భోగి పళ్లు అంటారు. వీటి కోసం రేగు పండ్లు, బంతి పువ్వుల రెక్కలు, చెరుకు గడలు, నాణేలు అన్ని కలిపి తయారు చేస్తారు. అలాగే వీటిలో శనగలను కూడా కలుపుతారు. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో పిల్లలకు కొత్త దుస్తులు వేసి రెడీ చేస్తారు. ఆ తర్వాత వారికి దిష్టి తీసి భోగి పండ్లను గుప్పిట్లో తీసుకుని, పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతారు. ఆ తర్వాత వారి తల మీద వేసి పిల్లలను ఆశీర్వదిస్తారు. ఇలా కుటుంబ సభ్యులే కాకుండా కొందరిని భోగి పళ్లకు పిలుస్తుంటారు. ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఇలా భోగి పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దేవుడి ఆశీస్సులు అందుతాయని పురాణాలు చెబుతున్నాయి.
పిల్లలకు భోగి పళ్లు పోయడానికి ఓ కారణం ఉందట. బదరీ వనంలో పరమ శివుడిని మెప్పించడానికి నరనారాయణులు ఘోర తపస్సు చేసేవాడట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ పళ్లను కురిపించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ బదరీ పళ్లను రేగు పండ్లు అని కూడా పిలుస్తారు. ఇలా అప్పటి నుంచి భోగి పండ్లను పోస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోయడం వల్ల దిష్ట పడదని, ఎలాంటి చెడు వారి జీవితంలోకి రాదని నమ్ముతారు. అలాగే భోగి పండ్ల వల్ల వారికి జ్ఞానం కూడా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.