Akshaya Tritiya 2024: హిందూవులు వైశాఖ మాసం వచ్చిందంటే చాలు అక్షయ తృతీయ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందు నుంచే సమాయత్తం అవుతారు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటికి మామిడి మరియు అశోక ఆకులను ద్వారానికి తోరణాలుగా కడతారు. కానీ ఇలా ఎందుకు కడతారో మీకు తెలుసా..?
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేదా అశోక ఆకులను తోరణాలుగా కడతారని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతుంటారు. దాంతోపాటుగా ఇంటిలో సానుకూల శక్తి ఉంటుందని విశ్వాసం.. ఈ క్రమంలో ప్రధాన ద్వారంపై విల్లు కట్టడం అనేది లక్ష్మీదేవిని స్వాగతించడానికి చిహ్నంగా భావిస్తారట. ఇలాంటి ఇంటిలో ఉన్న వారిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని, దీని వలన వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భక్తుల నమ్మకం.
ఈ రోజును పురస్కరించుకుని కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కాగా ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు ఉదయం 5.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున మామిడి ఆకులు లేదా అశోక ఆకుల తోరణాలు కట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందువలన ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. అంతేకాదు ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ఆరోగ్య పరంగా మేలును కలిగిస్తుంది.
సాధారణంగా పండుగలు, పర్వదినాలను పురస్కరించుకుని మామిడి ఆకులను తోరణాలుగా కట్టి ఇంటి ద్వారాలను అలంకరిస్తారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ తరహాలోనే అశోక ఆకులను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ ఆకులతో తయారు చేసిన తోరణాలను ఇంటి ప్రధాన ద్వారాలకు కడతారు. అదేవిధంగా ఆర్థిక పురోగతిని పొందడానికి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని లేదా ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని ఉత్తరం వైపు ఉంచాలి. మరునాడు దాన్ని తీసి భద్రపరుచుకోవాలట. ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పొంది ఆ ఇంటిలోని వారు ఆర్థిక పురోగతి సాధిస్తారని విశ్వాసం.