Agneepath Scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై రాజకుంటున్న అగ్గి ఎగసిపడుతోంది. తెలుగు రాష్ట్రాలను సైతం తాకింది. విలువైన ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలుగుతోంది. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శాంతి భద్రతలకు తీరని విఘాతం కలుగుతోంది. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిని చల్లార్చితే తప్ప వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా సూచనలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం సైతం తగ్గేదేలే అన్నసంకేతాలు ఇస్తోంది. దీనిపై వివాదం ముదిరి భద్రతకు తీరని విఘాతం కలగముందే పథకంలో మార్పుచేర్పులను చేయాలని రిటైర్డ్ ఆర్మీ నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని అమలుచేస్తే..
ప్రధానంగా అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు.
Also Read: Presidential Election: బీజేపీ అకర్ష్ మంత్రం.. సొంత బలంతోనే రాష్ట్రపతి ఎంపికకు యత్నం
25 శాతం మందినే పర్మినెంట్ చేయడం సబబు కాదు. కనీసం 50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి. అగ్నిపథ్‌పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చు. కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు? పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కన్పించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి.పథకంపై మరింతగా చర్చ తప్పనిసరి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపం. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు. పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సర్వీసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్‌గా చేపట్టడమో చేయాలి.
అగ్రదేశాల్లో సైనిక నియామకాలు ఇలా..
అమెరికా
అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్‌లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి.
చైనా
డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు.
ఫ్రాన్స్
సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సర్వీసులో ఉంటే పెన్షన్ ఇస్తారు.
రష్యా
సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సర్వీసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్‌లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
ఇజ్రాయెల్
పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది.
పాకిస్తాన్
నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్‌లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Retired army experts suggest changes to the agneepath scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com