
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల పనితీరును మెచ్చుకుంటూ.. జాతీయ మీడియా, జగన్ సర్కార్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించింది. అదే విషయాన్ని ఊటంకిస్తూ.. వైసీపీ నేతలు జగన్ ముందుచూపు పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లపై అంత మంచి అభ్రిప్రాయం లేదన్నది కొంత మంది ఉదేశ్యం. ఇతర దేశాల నుండి వచ్చిన వారి సమాచారం వాలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి అందచేయాలన్న పద్ధతి సరికాదు. పోలీసు యంత్రాంగం వివిధ విమానాశ్రయాల అధికారులనుండి ప్రయాణీకుల వివరాలను స్వీకరిస్తే మంచిదనేది కొంతమంది అభిప్రాయం.
వాలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టం. వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన లేదు. వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత ఎంత? ఇప్పటికే ప్రభుత్వం రోజుకో సంఖ్య చెబుతూ ప్రజల్లో విశ్వా సం కోల్పోతున్నది.పైగా వాలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నా రంటూ పాలకులు అసత్య ప్రచారానికి దిగటం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా మంది వాలంటీర్లు అనేక కారణాలతో విధులు నిర్వర్తించడం లేదు.
కరోనా వైరస్ ఉధృతి, ఆంక్షల నేపథ్యంలో రేషన్ సరుకులను దుకాణాల వద్ద ఇవ్వటం సరికాదు. వాలంటీర్ల ద్వారా ఆయా వినియోగదారులకు ఇళ్లవద్ద అందచేయడం శ్రేయస్కరం. అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకుంటే మంచిది అనేది కొందరి అభిప్రాయం.
అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో సంచార నిత్యావసర వస్తువుల విక్రయ విహనాల ద్వారా అవసరమైన వారికి నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందచేయాలి. ఇందువలన ప్రజలు ఇళ్లనుండి బయటకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.
ప్రభుత్వం లేనిపోని బేషజాలకుపోకుండా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోని, వీలైనంత త్వరగా కరోనా సోకిన వారిని గుర్తించి కరోనాని కత్తిడి చేయాలని కొంతమంది మేధావుల అభిప్రాయం. లేకుంటే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ పోతే అభాసుపాలవుతున్నారని హెచ్చరిస్తున్నారు.