ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అంచెలంచెలుగా పెరిగి, పాకి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ లో అడుగుపెట్టిన కోవిద్19 రోజురోజుకి కేసుల సంఖ్యను పెంచుకుంటూ..ప్రజలను భయపెడుతూ.. తన ఉనికిని చాటుకుంటుంది. పిడిగు పాటుగా వచ్చి పడిన ఈ విపత్తుని అదుపుచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షల మధ్యలో మొదటి దశ, రెండవ దశ లాక్ డౌన్ లను అమలుపరుస్తూ వస్తున్నాయి. అయినాసరే దేశంలో ఈ మహమ్మారి పోకడ ఇప్పటివరకు అదుపుకాలేదు. మరి ఈ హడావుడి ఎప్పటికి తగ్గుతుంది? ఈ వైరస్ హల్ చల్ ఎప్పటికి కట్టడి అవుతుందనే? ప్రశ్నలు సర్వసాధారణం. ఈ కరోనా విజృంభన తగ్గుదల పై అనేకమంది నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వివిధ సర్వేలు భిన్న స్వరాలను వినిపిస్తున్నాయి.
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ భారత్ లో వైద్య నిర్వహణపై, వైరస్ కట్టడిపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది. ఈ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం… మే 3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అనంతరం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. మే 3 నుంచి 12 మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయి. అనంతరం పూర్తిగా తగ్గిపోతాయని వెల్లడించింది. మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పింది.
భారత్ లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరోనా తగ్గే అవకాశం ఉండొచ్చని కొందరు అంచనాలు వేస్తున్నారు. అలాగే, భారతీయులకు ఉన్న ఎక్కువ వ్యాధినిరోధక శక్తి వల్ల తక్కువగా విస్తరించే అవకాశాలున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లభించలేదు.
మరోవైపు, కేంద్ర సాధికార కమిటీ నివేదికలో స్పష్టమైన అంశాలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సింగపూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి. భారత్ లో కరోనా కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యతో పాటు వైరస్ వ్యాప్తి రేటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగపూర్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ పరిశోధకులు పలు అంచనాలు వేశారు. వారు వెల్లడించిన అధ్యయనంలో భారత్ జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని తేలింది. మే 21 నాటికి భారత్ లో కరోనా తీవ్రత 97 శాతం తగ్గుతుదని ఈ పరిశోధకులు వెల్లడించారు.
ప్రజలు ఏమి చేయాలి? ప్రభుత్వాలు ఏమి చేయాలి?
కరోనా మహమ్మారి కట్టడి, వ్యాప్తిలో తగ్గుదలపై ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ప్రజలు లాక్ డౌన్ నియమాలు పాటించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిద్19 నియంత్రణకు ప్రజలు జాగ్రత్తలు ఎంత ముఖ్యమో ప్రభుత్వ విధానాలు, కట్టడి చర్యలు కూడా అంతే ముఖ్యం. మాస్ టెస్టింగ్ లు చేస్తూ. క్వారంటైన్ నియమాలను విధిగా పాటిస్తూ ముదుకెళ్తే కరోనాని నియంత్రించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.