“మాట వినేవాళ్లకైతే ఏదైనా చెబుతాం. వద్దన్నా వినకుండా రోడ్ల వెంట నడుచుకుంటూ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వలస కూలీలకు ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? చనిపోతారని తెలిసి కూడా రైలు పట్టాలపై నిద్రపోయేవాళ్లను ఎలా ఆపాలి? చాలా మంది ఇప్పటికే దారి మధ్యలో ఉన్నారు. వాళ్లను ఆపడం అసాధ్యం. అయినా.. ఏ కూలీ ఎక్కడున్నాడో కనిపెట్టి వాళ్లను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన పనిని కోర్టులు ఎందుకు తలెత్తుకోవాలి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మేం ఎలాంటి సూచనలు చేయబోము..” అంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీలపై అనూహ్యమైన, ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, తలపండిన మేధావులు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడికి అండగా నిలబడాల్సిన న్యాయస్థానం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల కొరకు ప్రత్యేక విమాన సదుపాయాలు ఏర్పాటు చేసిన కేంద్రం, అభాగ్యులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వలస కూలీలకు ఆ ఏర్పాట్లు చేయలేమనడం ఆశర్యం. పక్కా ప్లానింగ్ తో వివిధ దేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించిన కేంద్రం, అదే ప్లానింగ్ తో స్వదేశీయులను వారి వారి స్వస్థలాలకు తరలించలేక, కూలీలదే తప్పని చెప్పడం విచారకరం.
ఒక రోజు కర్ఫ్యూ (మార్చి 22) కి నాలుగు రోజుల ముందు (మార్చి 19న) ప్రకటించిన మోడీ సర్కార్, 21 రోజుల లాక్ డౌన్1.0 (మార్చి24 నుండి ఏప్రిల్ 14 వరకు) నాలుగు గంటల ముందు (మార్చి 23 రాత్రి 8 గంటలకు) ప్రకటించిన మోడీ సర్కార్ ని ఎందుకు నిలదీయలేదు..? దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది వలస కూలీల జీవనోపాధి గూర్చి ఆలోచించకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ ని ఎలా ప్రకటించారు? అని బీజేపీ సర్కార్ ని ఎందుకి నిలదీయలేకపోతుంది ఈ సర్వోన్నత న్యాయస్థానం?
తీసుకొని వచ్చిన కాంట్రాక్టర్లు మోసం చేశారు. చేతిలో పని లేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఆకలితో చస్తున్నా.. పట్టించుకున్న నాధుడే లేడు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు ఏమి చేయమంటారు? ఉన్నచోటే చస్తే దిక్కుండదేమో అని తమ ఇళ్లకు బయల్దేరారు. అండగా నిలబడాల్సిన న్యాయస్థానమే కేంద్రానికి కొమ్ముకాస్తదని తెలిసుంటే వాళ్లు బయటకు రాకపోయేవాళ్లేమో… మీరన్నట్టు దారి మధ్యలోనే చేస్తామని తెలిస్తే వాళ్ళు రాకపోయేవాళ్లేమో.. కానీ కాలం కూడా వారిని మోసం చేసింది. విధి వారిని వెక్కిరించింది. అందుకే మీలాంటి తలపండిన మేధావులతో మాటపడాల్సి వచ్చింది.
వాళ్లు బయటకు రాకపోయి ఉంటే ఇప్పుడు అక్కడక్కడ ఏర్పాటు చేసిన శిబిరాలు ఉండేవా? కొంతమందైన మూడుపూట్ల భోజనాలు చేసేవారా? ప్రస్తుతం లక్షల మంది రోడ్లపైన నడుస్తున్నారంటే.. వాళ్ళని పట్టించుకున్న వారు లేరు కాబట్టే.. అనే సత్యన్ని గ్రహిస్తే మంచిది. తల దాచుకోవడానికి కొంచం నీడ ఉండి, తినడానికి తిండి ఉంటే వాళ్ళు బయటకు రారు జడ్జిగారు.