
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదటి దశలో 21రోజుల లాక్ డౌన్, రెండవ దశలో 19 రోజుల లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా లాక్ డౌన్ 2.0 లో మోడీ సర్కార్ కొన్ని నిబంధనలు సడలిస్తూ.. మరో నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వం ఈ రెండు లాక్ డౌన్ లను ఎంతో కొంత అమలు చేస్తూ.. తాజాగా ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఉల్లంఘించి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభన కారణంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాలు పాటించాలని, సొంత నిర్ణయాలు పనికిరావని కేరళ ప్రభుత్వానికి హిత బోధచేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వీర్యం చేయవద్దని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. కేరళకు ప్రత్యేకంగా లేఖ రాశారు. కానీ కేరళ ప్రభుత్వంపై మోడీ సర్కార్ ఆగ్రహం వ్యర్థమని అనేకమంది నిపుణులు సూచిస్తున్నారు.
దేశంలోనే తొలి కరోనా కేసు కేరళలో జనవరిలొనే నమోదయ్యింది. అప్పటినుండి కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి అలుపెరుగని పోరాటం చేస్తుంది. కేంద్రం మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుపరిచింది కానీ కేరళ సర్కార్ జనవరి చివరి వారం నుంచే అనధికార లాక్ డౌన్ అమలుపరుస్తూ వచ్చింది.ఆ తర్వాత మార్చి 11న ముఖ్యమంత్రి పి. విజయన్ అధికారిక లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సంబంధించిన జాగ్రత్తలు దేశం మొత్తం మార్చి చివరి వారంలో ప్రారంభిస్తే కేరళ ప్రజలు జనవరి నుంచే ప్రారంభించి కరోనాని నియంత్రించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంటే కేరళ రాష్ట్రంలో కరోనా కేసులను తగ్గించుకుంటూ వచ్చింది. ఒక్కప్పుడు కరోనా కేసుల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు 10వ స్థానానికి చేరుకుంది.అన్నిటికంటే ముఖ్యంగా కేరళలో కరోనా మరణాల సంఖ్య 3కే పరిమితం చేయడం దేశంలోనే రికార్డ్.
130కోట్ల ప్రజలకు కేంద్రం 1.7కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే 3.3కోట్ల జనాభాకు కేరళ ప్రభుత్వం 20వేల కోట్ల ప్యాకేజి ప్రకటించి అందులో ఇప్పటికే 12,500 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. కరోనా కిట్ల సమస్య దేశంలో అనేక రాష్ట్రాలలో ఉంది కానీ కేరళలో ఆ మాస్కుల కొరత అనే మాటే లేకుండా చేయడం ప్రభుత్వ ముందు చూపుకు నిదర్శనం. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్ లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయడంతో సగం విజయం సాధించినట్టయింది. తొలి కేసు నమోదైన వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న అయిదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లు, అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రులను సిద్ధం చేసింది. కరోనా అనుమానితుల్ని అన్ని రాష్ట్రాల్లోనూ 14 రోజుల క్వారంటైన్ లో ఉంచితే కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్ లో ఉంచింది. అదే సరైన చర్యని ఇప్పుడు రుజువు అవుతోంది.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ ఎవరికైనా సోకితే వెంటనే వాళ్లంతా ఎవరెవరిని కలిశారో గూగుల్ మ్యాప్ సహకారంతో వెతికి పట్టుకొని మరీ పోలీసులు క్వారంటైన్ చేసేవారు. విపత్తుల సమయంలో ప్రజల్ని తరలించడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఈ సంక్షోభ సమయంలో కేరళని ఆదుకున్నాయి. ప్రతీ గ్రామాల్లోనూ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల సమాచారం అందించుకోవడం సులభమైపోయింది. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విధంగా కేరళ ప్రభుత్వం కరోనా పై పెద్ద యుద్ధమే చేసింది. దింతో విజయన్ సర్కార్ నేడు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆరోగ్యం, విద్యా రంగం మీద అత్యధికంగా ఖర్చు చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం మూడు అంచెల విధానం అమల్లో ఉంది. ఆ వ్యవస్థ కరోనాపై అపారమైన పోరాట పటిమ ప్రదర్శించి కరోనాపై విజయం సాధించింది. ఆలాంటి రాష్ట్రం కి కేంద్రం హిత బోధ చేయడం అనేది ” పిల్ల వచ్చి గుడ్డి ని ఎక్కిరించినట్లే ఉంది”