
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రస్తుతం సరైన మందు లేకపోవటంతో వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్లు విధించారని అయితే ఇవి మాత్రమే సరిపోవని, ఇతర ఆరోగ్యపరమైన చర్యలు కూడా చాలా కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్ర్తవేత్త సౌమ్యస్వామినాథన్ తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు చేస్తున్న పోరాటం దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయ పడ్డారు. గత 30 ఏండ్లుగా హెచ్‌ఐవీ, ట్యూబర్ కు లోసిస్ వ్యాధులపై ఆమె పరిశోధన చేస్తున్నారు. ఈ వైరస్ లను అదుపుచేయాలంటే వాటి జెనటిక్ సీక్వెన్స్ ను అధ్యయనం చేయటం చాలా కీలకమని ఆమె అన్నారు. భారత ఆరోగ్యశాఖలో కీలకమైన ఐసీఎంఆర్ కు 2015 నుంచి 2017వరకు ఆమె కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ఇప్పటివరకు కరోనా కట్టడికి వ్యాక్సిన్ లేదు. టీబీ, మలేరియా వ్యాధులకు ఇచ్చే మందులనే కరోనా రోగులకు కూడా వాడుతున్నారు. ఈ మందులు కరోనాను తగ్గించటంలో కొంతలోకొంత ఉపయోగపడుతున్నాయని వైద్యులు, పరిశోధకులు నమ్ముతున్నారు. అయితే టీబీకి వాడే బీసీజీ కరోనా వ్యాధిని నయంచేసినట్లు ఇప్పటివరకు శాస్త్రీయమైన ఆధారాలేవీ లభించలేదని భారత సంతతి పరిశోధకుడు మధుకర్ పై అన్నారు. కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీలో మెక్‌గిల్ గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు ఈయన డైరెక్టర్ గా ఉన్నారు. అంటువ్యాధులపై పరిశోధన చేస్తున్నారు.
బీసీజీ మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందనటంలో సందేహం లేదని, కానీ కోవిడ్ నియంత్రణలో ఎంతమేర విజయవంతం అవుతుందనేదానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని ఆయన వెల్లడించారు. అయితే తక్కువ ధరలో దొరికే బీసీజీని కోవిడ్-19 నియంత్రణకోసం దీనిని వాడటం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. దీనిపై అమెరికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాల్లో ట్రయల్స్ కూడా మొదలయ్యాయని, ప్రస్తుత సంక్షోభాన్ని దీనితో ఏమేరకు అధిగమిస్తామన్నది చెప్పలేమని అభిప్రాయపడ్డారు.