
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం బీజేపీలో ఒకరిపై మరొకరు బాధ్యతలను నెట్టివేసుకొనే పరిస్థితులకు దారితీస్తుంది. ఈ పరాజయంపై ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ విప్పలేదు. మొత్తం ప్రచారాన్ని తన భుజస్కందాలపై నడిపించిన హోమ్ మంత్రి అమిత్ షా కొందరు పార్టీ నాయకుల వివేశపూర్వక ప్రసంగాలు తమకు తీవ్ర నష్టం కలిగించినట్లు అంగీకరించారు.
ఆ విద్వేష పూర్వక ప్రసంగాలు చేసిన వారిలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వామి ఆదిత్యనాథ్ తో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు – ప్రకాష్ జావడేకర్, అనురాగ్ ఠాకూర్ ఉండటం గమనార్హం. వారిద్దరు కీలక మంత్రిత్వ శాఖలలో ఉండడంతో పాటు జావడేకర్ ఢిల్లీ ఎన్నికల ఇన్ ఛార్జ్ కూడా. వీరిలో ఠాకూర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను `ఉగ్రవాది’ అంటూ నిందించగా, ఆయనను జావడేకర్ సమర్ధించారు.
వీరితో పాటు పలువురు బిజెపి నాయకులు చాలాకాలంగా ఇటువంటి విద్వేషపూర్వక ప్రసంగాలు చేస్తున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానం పట్టించుకోనని లేదు. వారిని స్టార్ స్పీకర్లకుగా వివిధ రాష్ట్రాలలో పార్టీ ప్రచారానికి పంపుతూనే ఉన్నారు. ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరాజయం ఎదురు కావడంతో పార్టీలో `బాలి పశువు’లను వెతికే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది.
తాజాగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తేవారి సహితం విద్వేష పూర్వక ప్రసంగాల వల్లనే ఢిల్లీలో బిజెపి ఓటమికి కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సహచరుడు కపిల్ మిశ్రాలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, ప్రకాశ్ జవదేకర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద ప్రకటనలే తమ కొంపముంచాయని చెప్పారు.
సందర్భం ఏమైనప్పటికీ వారి విద్వేషపూరిత ప్రసంగాలతో అంతిమంగా పార్టీ నష్టపోయిందని తెలిపారు. రాజకీయ నాయకులు చేసే ద్వేషపూరిత ప్రసంగాలకు ఫలితం అనుభవించకతప్పదని కూడా పేర్కొనడం గమనార్హం. డిసెంబరులో ఢిల్లీలో జరిగిన సీఏఏ అనుకూల ర్యాలీలో బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. దేశద్రోహులను కాల్చి పడేయాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీ నేతే అయినా ఇలాంటి ప్రసంగాలు చేసే వారిని శాశ్వతంగా పార్టీ నుంచి తొలగించాలని కోరుకుంటుంటున్నా. విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారు ఎన్నికల్లో పోటీ హక్కును కోల్పోయేలా ఓ విధానాన్ని తీసుకురావాలి. అలాంటి విధానాన్ని తీసుకొస్తే ఓ వ్యక్తిగా (పార్టీ అధ్యక్షుడిగా కాకుండా) నేను పూర్తి మద్దతు ఇస్తాను’’ అని తివారీ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం కూడా పార్టీ ఓటమి ఓ కారణమని మనోజ్ తివారీ పేర్కొన్నారు.