
మహారాష్ట్రలోని పాల్ఘర్ లోని గాడ్చినలే గ్రామంలో ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ ని మొత్తం ముగ్గుర్ని కనికరం లేకుండా కర్రలతో, రాళ్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో అరెస్టైన నిందితుల జాబితాను ఉద్ధవ్ సర్కారు విడుదల చేసింది. 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేసింది. ఈ ముగ్గురి హత్య వెనుక ముస్లింలు ఉన్నారని కొంత మంది హిందూ మతోన్మాదులు దుష్ప్రచారానికి పాల్పడ్డారు.
సాధువుల హత్య కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా అందులో ఒక్క ముస్లిం పేరు కూడా లేకపోవడంతో ఈ ఘటన కుట్ర పూరిత చర్య కాదని తేటతెల్లమైంది.
మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్ గా గుర్తించారు. తమ సమక్షంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది.
యూపీ సీఎం యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడటంతో ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
అసలేమి జరిగింది…?
ఏప్రిల్ 17 రాత్రి 9.30 నుండి 10గంటల మధ్యలో ఒక వ్యానులో ముంబయి నుండి సూరత్ కి బయల్దేరిన సుశీల్ గిరి మహారాజ్ (35), నీలేష్ తెల్గేన్ (35), చికానే మహారాజ్ కల్పవ్రిక్షిగిరి (70) అనే ముగ్గురి వ్యక్తుల్ని పాల్ఘర్ గ్రామ ప్రజలు ఆపి విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఆ ముగ్గురిలో ఇద్దరు సాధువులు కాగా మూడో వ్యక్తి డ్రైవర్. అయితే అంతకంటే ముందే ఆ గ్రామంలోకి పిల్లల్ని కిడ్నాప్ చేసి, అవయవాలు అమ్ముకునే వారు వస్తున్నారనే వార్త వైరల్ అయింది. దింతో ఆ గ్రామస్థులు మెలకువగా ఉండి సూరత్ లో అంత్యక్రియలకు వెళ్తున్న వ్యానిని ఆపి అనుమానంతో దాడి చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులందరు ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు సమీప ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.ఆ ముగ్గురి పై దాడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. కేంద్ర హోమ్ శాఖ నివేదిక ఇవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వన్ని కోరింది.