
రాజధాని ప్రకంపనలు రోజు రోజుకీ రంజుగా మారుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు అనుకూల ప్రచార సాధనాలు, మరోవైపు జగన్ అనుకూల ప్రచార సాధనాలు పోటాపోటీగా వార్తలను, వీడియోలను పోస్ట్ చేస్తు న్నారు. రెండూ చూస్తే బుర్ర వేడెక్కి బీపీ పెరగటం ఖాయం. అయితే ఇప్పటికే చాలామంది ఎటో ఒకవైపు మొగ్గు చూపటం జరిగిపోయింది కాబట్టి వాళ్లకు నచ్చిన ఛానల్ చెప్పినదాన్నే మనసులోకి ఎక్కించుకుంటున్నారు. ఆరోగ్యరీత్యా అదేమంచిదేమో మరి. లేకపోతే అటు ఇటు వాయింపుడుతో బుర్ర వేడెక్కి మంచమెక్కటం ఖాయం.
చానళ్ళు ఇప్పటికే చాలావరకు రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయాయి కాబట్టి చూసేవాళ్ళు ఆ చానళ్ళు చూపించేది గుడ్డిగా నమ్మేయటంలేదు. ఉదాహరణకు ఈటీవీ , టివీ 5, ఏబియెన్ ఆంధ్ర జ్యోతి ప్రసారం చేసిందాన్ని అందరూ ఒకే దృష్టితో చూడటంలేదు. ఇప్పటికే అమరావతి వైపు మొగ్గు చూపిన వాళ్ళు కళ్ళార్పకుండా చూస్తే మిగతా వాళ్ళు క్రిటికల్ గా చూడటం అలవాటు చేసుకున్నారు. అలాగే సాక్షి ఛానల్ ప్రసారం చేసేది జగన్ అనుకూలురు కళ్ళార్పకుండా చూస్తే మిగతా వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రచారంగా భావిస్తున్నారు.
టీవీ 9 , ఎన్ టీవీ లు రెండు వాదనలను సమానంగా ప్రసారం చేయటానికి ప్రయత్నం చేయటంతో అటూ ఇటూ పూర్తిగా మొగ్గని వాళ్ళు వాటినే ఎక్కువగా చూస్తున్నారు. కొన్ని చానళ్ళు కేవలం తెలంగాణ వార్తలకే పరిమితం కావటంతో అవి ఆంధ్రాలో పెద్దగా చూడటంలేదు. ఆ కోవలో వి 6, టి న్యూస్ వస్తాయి. మిగతా చానళ్ళు పెద్దగా రేటింగ్స్ లేవు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పత్రికల విషయానికి వస్తే పాపులర్ పత్రికలు ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఒకవైపు, సాక్షి ఇంకో వైపు పోటాపోటీగా వార్తలు రాస్తున్నాయి. ఈనాడు ప్రతిరోజూ అమరావతి ఎందుకు కావాలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు గుప్పిస్తుంటే పోటీగా సాక్షి ఎందుకు మూడు రాజధానులు కావాలో వండి వారుస్తుంది. చివరకు ఈ యుద్ధం ప్రజలమధ్యకన్నా ఛానళ్లు, పత్రికల మధ్యగా మారింది.
మరి ఈ మధ్యలో రైతుల పరిస్థితేమిటి? వాళ్ళేం పాపం చేశారు? రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళను గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పుడు వాళ్ళ పరిస్థితేమిటో తెలియక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వాళ్ళను ఇన్నాళ్లు రోడ్డుమీద నిలబెట్టటం క్షమించరాని నేరం. వాళ్ళఆశలు నిరాశలైనందుకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అమరావతి రాజధాని కాకపోతే వాళ్లకు ఏవిధంగా న్యాయం చేస్తారో జగన్ ఇప్పటికే చెప్పి వుండాల్సింది. దాదాపు నెలరోజులు రోడ్లమీదకు వచ్చి ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు టెంటుల్లో గడపటం ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు సిగ్గుగా అనిపించటంలేదా? మీ రాజకీయ నిర్ణయం ఏమైనా గాని రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ కు లేదా? రైతుల దగ్గరకు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి మీకు ఎటువంటి నష్టం లేకుండా నేనున్నానని ఎందుకు చెప్పలేదో అర్ధం కావటంలేదు. ఇది బాధ్యతా రాహిత్యం. రైతుల ఉసురు పోసుకోవటం శోభగా అనిపించదు . రైతులు భోళా మనుషులు. దగ్గరకు తీసుకొని మాట మాటా కల్పి ధైర్యం చెప్పివుంటే ఇక్కడిదాకా వచ్చేదికాదు. రైతులందరూ చంద్రబాబు నాయుడు మద్దతుదారులనుకోవటం పొరపాటు. వాళ్ళ ఆవేదనలో అర్థముంది, న్యాయముంది, బాధవుంది. సహృదయంతో చేరదీసి వాళ్లలో విశ్వాసం కల్గించాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిది. ఈ విషయంలో ప్రభుత్వాధిపతిగా జగన్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇద్దరి కొట్లాట మధ్య రైతులు బలికావటం బాధాకరం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జనవరి 20వ తేదీదాకా వేచివుండకుండా రైతుల్ని పిలిచో , దగ్గరకు వెళ్ళో వాళ్లకు ఉపశమనం కల్గించాలి. ఇది ప్రభుత్వాధినేతగా కనీస బాధ్యత. ఆ పని ప్రభుత్వం చేయకపోవటంతో వాళ్లకు ఒకవైపు రాజకీయంగా మొగ్గటం తప్ప వేరే దారిలేకుండా పోయింది. ఇప్పటికైనా జగన్ మోహన రెడ్డి పెద్దమనసుతో రైతుల సమస్యను మీ రాజకీయ నిర్ణయంతో ముడిపెట్టకుండా వెంటనే పరిష్కరిస్తాడని ఆశిద్దాం.