ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని ప్రకంపనలు అన్ని పార్టీల్లో, అన్ని వర్గాల్లో చీలిక తెచ్చాయి. మూడు రాజధానుల ప్రకటన తెలుగుదేశంలోనూ ఉత్తరాంధ్ర పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఇక జాతీయపార్టీ బీజేపీ లో ఎవరికితోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. సుజనాచౌదరి, పురందేశ్వరి మూడు రాజధానులపై వ్యతిరేకత వ్యక్తం చేయగా పార్టీ అధికార ప్రతినిధి జి వి ఎల్ నరసింహారావు స్వాగతించారు. కన్నా లక్ష్మీనారాయణ , బీజేపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తూ మాట్లాడాడు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర విభాగం నిట్ట నిలువునా చీలిందని చెప్పొచ్చు.
ఇంకో విశేషమేమంటే మెగా కుటుంబం కూడా దీనికి మినహాయింపు కాదు. మూడు రాజధానుల విషయమై మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జగన్ నిర్ణయాన్ని విమర్శించాడు. ఒక రాజధానికే దిక్కు లేదు, మూడు రాజధానులా అని హేళన చేశాడు. ఆ తర్వాత రెండురోజులకి మెగాస్టార్ చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేయం జరిగింది. జగన్ నిర్ణయాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా సమర్ధించటమే కాకుండా దానికి కారణాలను తనదైన రీతిలో వివరించాడు. కాకపోతే భూములిచ్చిన రైతుల విషయంలో ఏదయినా చేయాలని చెప్పటం జరిగింది. ఇక మధ్య సోదరుడు నాగబాబు కూడా తనదైన రీతిలో స్పందించాడు. తన ప్రకటన స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ వైఖరిని సమర్ధించినట్లుగా వుంది.
మరి ఇప్పుడు మెగా అభిమానుల పరిస్థితేమిటి? పోయిన ఎన్నికల్లో మెగా కుటుంబం ఒకటిగా జనసేనకు మద్దతిచ్చింది. చిరంజీవి ప్రత్యక్షంగా జనసేనకు ప్రచారం చేయకపోయినా తన పరోక్ష మద్దత్తు జనసేనకె ఉన్నట్లు అందరూ అనుకున్నారు. రామ్ చరణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళటం దీనికి ఊతమిచ్చింది. ఇప్పుడు చిరంజీవి బహిరంగంగా మద్దత్తివ్వటం మెగా అభిమానుల్ని ఇరకాటంలో పెట్టింది. దీనికి తెరవెనక కారణాలపై రక రకాలుగా విశ్లేషించుకుంటున్నారు. వాస్తవాలేమిటో ఇంకొన్నిరోజులు పోతే గానీ బయటకి రావు. ఈ పరిణామం తో మెగా అభిమానులు పెద్ద ఇరకాటంలో పడ్డట్లే. ముందు ముందు ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
చిరంజీవిని దగ్గరగా చూసేవాళ్ళు అనుకోవటం ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెబుతున్నారు. చిరంజీవి స్వతహాగా పవన్ కళ్యాణ్ లాగా దుందుడుకు స్వభావం కలిగినవాడు కాదు. ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగా ఆంధ్రాలో అధికారంలో ఉంటుంది. ప్రభుత్వంతో వైరం పెంచుకోవటం తన మనస్తత్వానికి సరిపడదు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో వుండి జగన్ పై కక్షపెంచుకోవటంతో ఆ ప్రభావం తనపై పడకూడదని అనుకొనివుండొచ్చు. అందుకనే అమరావతి వెళ్ళల్లా జగన్ని అభినందించి వచ్చాడు. అయితే వెళ్లేముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి అక్కడ్నుంచి జగన్ దగ్గరకు వెళ్ళాడు. అంటే రాజకీయాలు వేరు, కుటుంబం వేరనే సంకేతం ఇచ్చాడు. ఇప్పుడుకూడా అదే సంకేతమిచ్చాడని అనుకోవాలా? లేక ఇంకేమైనా ఉందా అనేది తెలియటంలేదు. ఒకటిమాత్రం నిజం. చిరంజీవి దాసరి నారాయణరావు బతికున్నప్పుడు తన ఇంట్లో కాపు నాయకుల సమావేశానికి హాజరయ్యాడు. ఆ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అధికారం అమరావతిలో కేంద్రీకరించటం కాపునాయకులకు ఇష్టం లేదని అనుకోవాలా? కొద్దిరోజులు పోతేగానీ మరికొన్ని విషయాలు బయటకి రావు. ఎందుకంటే జగన్ కాపు నాయకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయటం ఇటీవలే జరిగింది. అందుకనే జగన్ విషయంలో చిరంజీవికి సానుభూతి ఉందని అనుకోవాల్సివస్తుంది.
ఏది ఏమైనా చిరంజీవి-పవన్ కళ్యాణ్ భిన్న వైఖరులు మెగా అభిమానుల్లో కలకలం లేపింది. కొన్నాళ్ళు పోతేగానీ ఇది ఎక్కడకు దారితీస్తుందో తెలియదు. అప్పటిదాకా వేచిచూడక తప్పదు.