
బొల్లినేని శ్రీనివాస గాంధీ కేసులో మరిన్ని నిజాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్ ఇడి ఆఫీసులోనే రాజకీయ పెద్దల పలుకుబడితో ఎక్కువకాలం పనిచేశాడు. ఆ టైములో తన అధికారానికి మించి పెత్తనం చెలాయించాడు. సంయుక్త కార్యదర్శి అధికారాలు కూడా తనే చేసేవాడు. కీలకమైన కేసులు తన దగ్గరే అట్టిపెట్టుకోవటమే కాకుండా మిగతా కేసులు కూడా ఎవరికివ్వాలో సంయుక్త కార్యదర్శికి బదులు తనే చేసేవాడు. ఇప్పుడు తన నిర్వాకాలన్నీ ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆంతరంగిక సమాచారాన్ని తనకు అనుకూలమైన, తన వర్గానికి చెందిన వ్యక్తులకు చేరవేసేవాడని ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది.
సుజనా చౌదరి కి చెందిన కేసుల్లో తనకు గాంధీ ద్వారా ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు చేరేది. ఇటీవల జీఎస్టీ ఇన్ పుట్ క్రెడిట్ తప్పుడు బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసిన వ్యవహారంలో కూడా సుజనా చౌదరికి ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిసింది. తన మోడస్ ఆపరెండి లో ఇంకో వ్యవహారం బయటకు వచ్చింది. తన వర్గానికి, కావాల్సిన వాళ్లకు సంబంధించిన కేసుల్లో తప్పనిపరిస్థితుల్లో కేసులు బుక్ చేసి సీరియస్ ఛార్జీలకు బదులు చిన్న చిన్న చార్జీలు పెట్టి కేసుల్లోనుంచి బయట పడేసేవాడు. ఇవన్నీ ఇప్పుడు బయటకొచ్చి తన మెడకు వుచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా గాంధీని జీఎస్టీ నుండి బదిలీ చేశారు. ఆ తర్వాత వీటన్నింటిపై దర్యాప్తు జరుపుతారని తెలిసింది.
గాంధీ భార్య శిరీష పై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆవిడ ఐటీ రిటర్న్ లో కన్సల్టెన్సీ ద్వారా ఆదాయం వచ్చినట్లు చూపించటం జరిగింది. ఆ ఫర్మ్ కస్టమ్స్, ఎక్సయిజ్ విశ్రాంతి ఉద్యోగులతో స్థాపించి నిందితులకు సలహాలిస్తూ సమాచారం చేరవేస్తూ వచ్చింది అందులో డైరెక్టర్ గా వున్న శిరీషనేనని తెలుస్తుంది. దీనిపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముందు ముందు ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచిచూద్దాం
.