
రెండురోజుల్నుంచి వస్తున్న వార్త చంద్రబాబునాయుడు అనుచరుల్ని కలవరానికి గురిచేస్తుంది. రాయపాటి సాంబశివరావు కి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై సిబిఐ, ఇ డి దాడులు, దృష్టిపెట్టటం చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా ఇ డి అక్రమ నగదుచలామణి కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఆలోచించాలి. రాయపాటి సాంబశివ రావు రాజకీయంగా కురువృద్ధుడు. మొదట్నుంచీ కాంగ్రెస్లో వుంటూ గాంధీ కుటుంబానికి అతిసన్నిహితంగా మెలిగిన వ్యక్తి. కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగుదేశంలో చేరటం జరిగింది. 2013 లో పోలవరం కాంట్రాక్టు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి రావటం వెనక తెరవెనక చాలా కధ నడిచిందని చెబుతారు.
అలా కాంట్రాక్టు సంపాదించినా ఎందుకనో దాన్ని కట్టటంలో అనేకవిమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు తెలుగుదేశంలో చేరినా చంద్రబాబు నాయుడు కూడా ఆ కాంట్రాక్టును రద్దుచేయాల్సివచ్చింది. మొత్తం బ్యాంకులదగ్గర షుమారు 9 వేల కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తీసుకున్న డబ్బులు వేరే పనులకు, ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే యూనియన్ బ్యాంకు 264 కోట్ల కుంభకోణ జరిగిందని సిబిఐ కి కంప్లెయింట్ చేయటం జరిగింది. దానిపై సిబిఐ ఒకేసారి అన్నిచోట్లా దాడులు జరపటం మనం పత్రికల్లో చూసాము. ఇప్పుడు ఇ డి ఫెమా కింద కేసు నమోదుచేయటం జరిగింది. ఇందులో తమాషా ఏమిటంటే రాయపాటి సాంబశివ రావు కొడుకు రాయపాటి రంగారావు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరు శ్రీధర్ తమని తప్పుదోవపట్టిచ్చాడని కంప్లెయింట్ ఇచ్చారని తెలుస్తుంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు పోవాలి. ఈ కంప్లెయింట్ నేపధ్యం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా అర్ధ కావటంలేదు. మొత్తం మీద చూస్తే ఇది సంచలనమైన వార్తనే.
ఇంతకుముందు నవయుగ కంపెనీ ప్రభుత్వ భూముల్ని తనఖాపెట్టి వేలకోట్లు రుణాలు తీసుకున్న సంగతి మన ఓకె తెలుగు లో బిగ్ స్టోరీ కింద రిపోర్ట్ చేయటం జరిగింది. ఇప్పటికీ మన సైట్ లో ఆ వార్త ప్రముఖంగా వుంది. ఎవరైనా ఆసక్తి గలవారు చూడొచ్చు. ముందు ముందు ఇది కూడా బిగ్ స్టోరీ కింద రిపోర్ట్ అయ్యే అవకాశం వుంది. అంటే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు అనుకూలంగా వున్న పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వసుందనేదానికి ఇది ఆరంభం మాత్రమేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం డెవలపింగ్ స్టోరీ కాబట్టి పూర్తి వివరాలు మొత్తం దర్యాపు పూర్తయిన తర్వాత గాని బయటకు రావు. ముందు ముందు ఈ పరిణామాలు ఎలాఉంటాయో వేచిచూద్దాం.