
తెలుగు దేశం పార్టీకి అన్ని వైపులనుంచీ కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు జగన్ చంద్రబాబునాయుడు గతంలో చేసిన తప్పులు, అవినీతి పనులపై భూతద్దంతో వెదికే పనిలో వున్నాడు. మరొకవైపు బీజేపీ డీలాపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాలం వేసి వేటాడే పనిలో వుంది. చంద్రబాబునాయుడుకి కుడిభుజం, ఎడమభుజం అనుకున్న సుజనా చౌదరీ , సీఎం రమేష్ బీజేపీ లో చేరటం అందరికీ ఆశ్చర్యమేసింది. ఇందులో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందనీ, తనను తాను రక్షించుకునే పనిలో భాగంగానే వాళ్ళిద్దరినీ బీజేపీ లోకి తానే పంపించాడని జనం నమ్ముతున్నారు.
ఇంతలో తెలుగుదేశంలోని కాపు నాయకులంతా కాకినాడలో సమావేశమై చర్చించుకోవటం సంచలనమయ్యింది. బీజేపీ లో చేరతారని , జగన్ పార్టీ లో చేరతారని రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇంతలో చంద్రబాబునాయుడు విదేశాలనుంచి తిరిగిరావటం , వాళ్లతో తిరిగి సంబంధాలు నెరపటం జరిగింది. ఇందులోభాగంగానే ఇటీవల కాపునేతలతో సమావేశం జరిగింది. అందులో ఏమిజరిగిందనేది ఇప్పటివరకు పూర్తి సమాచారం బయటకు రాలేదు. కాకపోతే చంద్రబాబు వాళ్ళను అన్నిరకాలుగా వెళ్లోద్దని ప్రాధేయపడ్డట్లు తెలిసింది. అయినా వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ పూర్తిగా తెలియటంలేదు.
ఈ నాయకులు ఎలా ముందుకు పోవాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నారని తెలిసింది. జగన్ పిలిచి పెద్దపీట వేస్తే గంపగుత్తగా దూకటానికి సిద్ధంగా వున్నారని తెలిసింది. అయితే జగన్ కి అంత పెద్దపీట వేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నట్లు కనిపించటం లేదు. తెరవెనుక బేరసారాలు కుదిరినట్లు లేదు. అలాగే రెండోవైపు బీజేపీ లో చేరటానికి కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. విశేషమేంటంటే జనసేన వైపునుంచి వీళ్ళను చేర్చుకోవటానికి ఎటువంటి ప్రయత్నమూ చేయటంలేదు. వీళ్లకూ ఆ ఆసక్తి ఉన్నట్లు లేదు. ఎందుకంటే ఇంకో అయిదు సంవత్సరాలు వీళ్ళు అధికారంలేకుండా ఉండాలంటే కష్టంగా వుంది. జగన్ కనుక పెద్దపీట వేయకపోతే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ లో చేరే అవకాశాలు మెండుగా వున్నాయి. ఒకటి స్పష్టం ఏమిటంటే తెలుగుదేశంలో ఎక్కువకాలం వుండరనేది. కాపులు దూరమయితే తెలుగుదేశం పని కష్టమే.