https://oktelugu.com/

Revanth Reddy : రేవంత్ రెడ్డి గారూ మీరు ఆ కుర్చీలో శాశ్వతం కాదుగదా

Revanth Reddy: రేవంత్ రెడ్డి గారూ మీరు ఆ కుర్చీలో శాశ్వతం కాదుగదా.. రేవంత్ పాలనా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2024 / 05:47 PM IST

    Revanth Reddy : తెలంగాణలో పది నెలల క్రితం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొలువుదీరిని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చింది. ఇందుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు దేశంలోనే అతి పొడవైన గంగా నది ప్రక్షాళనకు కూడా ఇంత భారీగా నిధులు ఖర్చు చేయలేదు. నమామి గంగే పేరుతో చేపట్టిన రివర్‌ ఫ్రంట్‌ ప్రాజక్టులన్నీ విఫలమయ్యాయి.

    ఇలాంటి పరిస్థితిలో లక్షన్నర కోట్లకుపైగా ఖర్చు చేసినా మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విఫలమైతే కాళేశ్వరం తరహాలోనే భారీగా నిధిలో మూసీలో పోసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ముందస్తుగా పూర్తి చేయకుండా మూసీ రివర్‌ ఫ్రంట్‌ సక్సెస్‌ కాదని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో శుద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఇక ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడంపైనా అభ్యంతరాలు చెబుతన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్ట్ ప్రధానంగా హైదరాబాద్ లో నది సుందరీకరణ, నీటి శుద్దికి మాత్రమే పరిమితం. హైదరాబాద్ దిగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నదీ తీరం వెంబడి ఏర్పాటైన పరిశ్రమల నుంచి నదిలో కలిసే వ్యర్ధ రసాయనాలతో నది నీరు పూర్తి కాలుష్యమయమైన, నేపథ్యంలో ఈ కాలుష్యాన్ని నివారించాలని పదే పదే డిమాండ్లున్నా ప్రస్తుత ప్రాజెక్ట్ లో దీన్ని చేర్చలేదు. ప్రధానంగా మూసీ నీటితో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో 23 వరకు కత్వలు, ఆనకట్టల ద్వారా దాదాపు 150 కి పైగా చెరువులు అనుసంధానం అవుతాయి. దిగువన కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టు ఉంది. ఈ మొత్తం వనరుల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు అందుతుంది. అయితే మూసీ నీరు కలుషితమవడంతో ఇక్కడ పండే పంటలకు, కూరగాయలకి, చేపలకి డిమాండ్ లేకుండా పోయింది. ఇంత తీవ్ర ఇబ్బంది ఈ మూసీ రైతాంగం ఎదుర్కొంటున్నా , కాలుష్యాన్ని నివారించడానికి ఈ ప్రాజెక్ట్ లో స్థానం లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేని ఈ ప్రాజెక్ట్ కి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కేవలం దోచుకోవడానికేననే ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం వద్ద సమాధానం కొరవడింది.

    రెండు రోజులుగా తెలంగాణ మంత్రులు సియోల్ లో పర్యటించారు. నగరాల్లోని నదులు ఎలా ఉన్నాయి? దాని లే అవుట్ ఎలా ఉంది? ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఇది ప్రభుత్వం జరుపుతున్న పీఆర్ ఎక్సర్ సైజులు.. అంత ఖర్చు పెట్టి మంత్రులను అక్కడికి పంపించడం ఏంటి? అతి తక్కువ ఖర్చుతో అహ్మదబాద్ వెళ్లండి.. మోడీ ఎప్పుడో చేసి చూపించాడు. ఎలా చేయవచ్చో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసి చూపించాడు.

    సబర్మతి చూపిస్తే మోడీని పొగిడినట్టు అవుతుంది. రాహుల్ వద్ద మైనస్ మార్కులు వస్తాయి.. తక్కువ ఖర్చుతో సబర్మతి చూడకుండా ఎక్కడో ఉన్న సియోల్ వెళ్లడం కరెక్ట్ కాదు. ఇంత ప్రయాస అవసరం లేదు.

    జనానికి ఉన్న అనుమానాలు ముందుగా తొలగించాలి. కాంగ్రెస్ గెలుపులో కీలకమైన సూపర్ 6 పథకాలు పక్కనపెట్టారు. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ చేపట్టారు. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఏ సీఎం ఏ రాష్ట్రంలో శాశ్వతం కాదు.. మూసీ ప్రాజెక్ట్ ఈ నాలుగు ఏళ్లలో పూర్తి కాదు.. కాకపోతే రేవంత్ పోస్ట్ ఉంటుందా? పదవిలో లేకపోతే వేరే నేత వచ్చినా.. వేరే పార్టీ అధికారంలోకి వస్తే మూసి పరిస్థితి ఏంటన్నది అందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న.

    ముందుగా దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్ లను పరిశుభ్రం చేయండి.. రేవంత్ రెడ్డి గారూ మీరు ఆ కుర్చీలో శాశ్వతం కాదుగదా అది ఆలోచించారా.. రేవంత్ పాలనా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.