Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలో సొంత బలంతోనే తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికార బీజేపీ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునేలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో వారికి గాలం వేసిన బీజేపీ, తాజాగా గోవా, హరియాణా, రాజస్తాన్‌పైనా కన్నేసింది.బలం పెంచుకునే ఎత్తుగడలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 48.9 శాతం ఓట్లున్నాయి. ఇంకో 11,990 ఓట్లు కావాలి. ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్ష ఎమెల్యేలకు గాలమేస్తోంది. బిహార్‌లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలూ, హిమాచల్‌లోనూ ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు.మధ్యప్రదేశ్‌లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్, రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెరిగిన బలం..
రాష్ట్రపతి ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ఊరట లభించింది. రాజ్యసభ ఎన్నికల తాజా ఫలితాలతో ఎగువ సభలో ఎన్డీఏ బలం 117కి చేరడంతో బీజేపీలో కదనోత్సాహం రెట్టింపైంది. 245 మంది సభ్యుల సభలో 233 మంది రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికయ్యే సంగతి తెలిసిందే. వీరికి మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కుంది. రాష్ట్రపతి నామినేట్ చేసే మిగతా 12 మంది ఓటువేయడానికి వీల్లేదు. 57 స్థానాలకు ఇటీవల ద్వైవార్షిక ఎన్నికలు జరుగగా.. వాటిలో తనకున్న 24 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోదని.. 20 మాత్రమే వస్తాయని అంతా భావించారు.
కానీ కర్ణాటక, మహారాష్ట్రలో ఆ పార్టీ రెండు సీట్లు అదనంగా దక్కించుకుని మొత్తంగా 99 స్థానాలు సాధించింది. అలాగే హరియాణాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. యూపీఏకి ఇప్పుడు రాజ్యసభలో 53 మంది సభ్యులున్నారు. టీఎంసీ(13), ఆప్(10), వైసీపీ(9), బీజేడీ(9), టీఆర్ఎస్(7), ఆర్జేడీ(6), సీపీఎం(5), సమాజ్‌వాదీ(3), సీపీఐ(2), టీడీపీ (1) సహా ఇతరులకు 71 మంది ఎంపీలున్నారు. వైసీపీ, బీజేడీ మద్దతుతో తన బలం 135కి చేరుతుందని.. ఏకసభ్య పార్టీలు కూడా కొన్ని కలిసొస్తాయని.. ప్రతిపక్షాల్లో ఐకమత్యం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిగ్గా గెలవగలమని బీజేపీ దృఢవిశ్వాసంతో ఉంది. కర్ణాటక (4), మహారాష్ట్ర (6), హరియాణా (2), రాజస్థాన్ (4)ల్లో 16 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సగం (8) కైవసం చేసుకుంది. వీటిలో రాజస్థాన్‌లో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో ఒక్కో సీటు అదనంగా దక్కడం గమనార్హం. కాంగ్రెస్ 5, దాని మిత్రపక్షాలు 3 సీట్లు గెలుచుకుని బీజేపీతో సమానంగా నిలిచినప్పటికీ.. హరియాణాలో మాత్రం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కలిసిరాని విపక్షాల ప్రయత్నం..
రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా రంగంలోకి దించాలనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని పార్టీలు కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను నిలబెట్టాలని ప్రతిపాదించినప్పటికీ అందుకు ఆయన నిరాకరించడంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ఇటీవల ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీకి కాంగ్రె్‌సను ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన టీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతినిధులు సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రతినిధులు రాష్ట్రపతి అభ్యర్థిపై దాదాపు గంటన్నరకుపైగా చర్చించారు. శరద్ పవార్‌ను పునరాలోంచాలని ప్రతిపక్షాలు అభ్యర్థించినప్పటికీ ఆయన అందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదని ప్రతిపక్షాలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
రాజకీయ పక్షాల మద్దతుకు..
మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీయేతర ముఖ్యమంత్రులు, నాయకులతో సుమాలోచనలు జరిపారు. తాజాగా మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించుకున్నట్లు సమాచారం. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపడానికి బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాలను నియమించిన సంగతి తెలిసిందే.
Also Read: AP BJP: ఏపీలో రూటు మార్చిన బీజేపీ.. టీడీపీ నేతలపై గురి
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Presidential poll bjp enjoys an upper hand opposition in search of a strong candidate
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com