Kumari Aunty Food Point: ఇటీవల సోషల్ మీడియాలో ఒక పేరు మార్మోగిపోతుంది. ఆమె ఓ సాధారణ మహిళ అయినా.. సెలబ్రిటీ స్థాయిలో మీడియా ప్రాధాన్యతను ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే కుమారి ఆంటీ. హైదరాబాదులో ఆమెపై కేసు నమోదు అయితే దాని ప్రకంపనలు ఏపీలో కనిపిస్తున్నాయి. టిడిపి- జనసేన, వైసీపీ అభిమానుల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసా?
హైదరాబాదులోని మాదాపూర్ లో కోహినూర్ హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ స్టాల్ లో భోజనం విక్రయిస్తుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆ తరువాత హీరో సందీప్ కిషన్ తో పాటు ‘ఊరు పేరు భైరవకోన’ చిత్ర యూనిట్.. కుమారి ఆంటీ స్టాల్ కు వచ్చి భోజనం చేయడంతో ఒక్కసారి పాపులర్ అయ్యారు. ఆమె ఫుడ్ స్టాల్ వద్ద విపరీతమైన గిరాకీ పెరిగింది. గతంలో రోజుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఆదాయం సంపాదించే ఆమె.. లక్షలాది రూపాయలకు పెంచుకునేలా ఆమె పాపులారిటీ దోహదపడింది.
కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం తినేందుకు జనం బారులు తీరారు. దీంతో పాటు యూట్యూబర్లు, బ్లాగర్లు ఎగబడ్డారు. రద్దీ పెరగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కుమారి ఆంటీ పై కేసు నమోదు చేశారు. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె ఫుడ్ బిజినెస్ కు బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియా ద్వారా ఆమె పాపులర్ అయ్యారో.. అదే సోషల్ మీడియా ద్వారా కష్టాలు తెచ్చుకున్నారు.ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. 2011 నుంచి హైదరాబాదులోని మాదాపూర్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు.తన వంటకాలతో ప్రాచుర్యం పొందారు.రోజుకు ఐదు కిలోల రైస్ తో ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు 100 కిలోలకు చేరింది. జనాలు ఎక్కువగా వస్తున్నడంతో గమనించిన ఫుడ్ బ్లాగర్స్ ఆమె వీడియోలను తీసి పెట్టడంతో సోషల్ మీడియాలో విశేష ప్రచారం జరిగింది. బిజినెస్ పెరిగింది.
అయితే ఆమె వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. జగనన్న కాలనీలో ఇల్లు దక్కించుకున్న కుమారి ఆంటీ వ్యాపారాన్ని టిడిపి అడ్డుకుందని.. రేవంత్ రెడ్డి తో చెప్పించి చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఒక ట్విట్ బయటపడింది. అప్పటినుంచి రచ్చ రచ్చ జరుగుతోంది. టిడిపి- జనసేన, వైసిపి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ పోలీసులు స్పందించారు. కుమారి ఆంటీ చేస్తున్న వ్యాపారం సొంత ప్లేస్ లో కాదని.. అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగడం వల్లే తాము అడ్డుకున్నామని చెబుతున్నారు. కానీ ఏపీలో ఎన్నికల వేళ తెలంగాణలో చిన్నపాటి వివాదాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.