https://oktelugu.com/

YS Jagan – Sharmila : జగన్ పై “షర్మిల పాచిక” పారుతుందా?

మరి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? కూటమి లోకి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తారా? లేక బిజెపిని అలానే ఉంచుతారా? అనేవి తేలాల్సి ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 1, 2024 / 07:45 PM IST
    Follow us on

    YS Jagan – Sharmila : రాజకీయాలనేవి ఇట్లానే ఉంటాయి అనుకోవద్దు. ఇలా సాగితేనే అవి రాజకీయాలు అవుతాయని భ్రమ పడొద్దు. శాశ్వత శత్రువులు ఉండన్నట్టే.. శాశ్వత మిత్రులు కూడా ఉండరు. మొత్తానికి అదొక మాయా చదరంగం. వచ్చే పావులు వస్తూనే ఉంటాయి. పోయే పావులు పోతూనే ఉంటాయి. ఇక్కడ కిరీటాలు మాత్రమే శాశ్వతం.. పదవులు కాదు అని కేజీఎఫ్_2 సినిమాలో హీరో అన్నట్టు.. రాజకీయాల్లో కూడా అలానే ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది కాబట్టి.. ఎత్తులు, పొత్తులు, కూడికలు, తీసివేతల కార్యక్రమం జోరుగా సాగుతోంది. సాధారణంగా ఎన్నికలంటే వ్యూహ ప్రతి వ్యూహాలు కామన్. 2019తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే నాడు చేయి చేయి కలిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారు నేడు బద్ద శత్రువులుగా మిగిలిపోయారు. నాడు బద్ధ శత్రువులుగా ఉన్నవారు నేడు మిత్రులు అయిపోయారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత అధికార వైఎస్ఆర్ సీపీ తరఫున జగన్ సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ తేడాలు కొట్టాయో తెలియదు.. మొత్తానికి అన్నతో విడిపోయి తెలంగాణలో తన తండ్రి పేరుతో ఒక పార్టీని ప్రారంభించారు. పాదయాత్ర నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించారు. కానీ చివరికి అనూహ్యంగా అక్కడి నుంచి ఆమె వైదొలిగారు. అన్ని రోజులపాటు తనతో నడిచిన కార్యకర్తల ఆశలను అడియాసలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

    అయితే ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమిలో బిజెపి కూడా కలుస్తుందని తెలుస్తోంది. అయితే అన్నింటికీ మించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఏపీలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు షర్మిలకు అప్పగించబోతున్నారని.. ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడతారని.. చంద్రబాబు బలంగా ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ బలంగా కనిపిస్తున్నప్పుడు.. షర్మిలను రంగంలోకి ఎందుకు దించాలి అనేది సర్వసాధారణంగా మెదులుతున్న ప్రశ్న. పైగా ఏపీ లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ఈసారి ఆయన ఓడిపోక తప్పదు.. అని ఓవర్గం మీడియా రాస్తోంది. అంతేకాదు జగన్ చేసిన ప్రతి పనిని కూడా భూతద్దంలో పెట్టి చూస్తోంది. మరి అలాంటి మీడియా.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తు ఎందుకు నచ్చుతోంది? సరే వారు రాజకీయ నాయకులు కాబట్టి పొత్తులు పెట్టుకుంటారు.. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా చిత్రీకరించడం దేనికి.. ఒకవేళ ప్రభుత్వ విధానాల్లో తప్పులు ఉంటే కచ్చితంగా రాయాల్సిందే. ఇలాంటి ధర్మాన్ని టిడిపి, జనసేన విషయంలో కూడా పాటించాల్సిందే కదా. మరి దానిని ఆ మీడియా ఎందుకు పాటించడం లేదు?

    ఒకవేళ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే అది ఎవరికి నష్టం? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికే లాభం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ మీద విజయం సాధించేందుకు అటు పవన్, చంద్రబాబు బలం సరిపోవడం లేదు కాబట్టే షర్మిలను ప్రయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే జగన్ గతంలో కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేసినప్పుడు తన బాబాయిని కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలబెట్టింది. అప్పుడు దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోనియాగాంధీని ఎదిరించారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు.. తన పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు టిడిపిలోకి తీసుకున్నప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. 2014 ఎన్నికల ఫలితాలు సందర్భంగా ‘ఇప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని కొట్టారు, మేము తీసుకున్నాం. రేపటి నాడు మేము రేపటి నాడు మేము కూడా అంతే బలంగా కొడతామని’ ఆ రోజే ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి, టిడిపి చరిత్రలోనే దారుణమైన ఓటమిని ఆయన రుచి చూపించారు.

    అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సానుకూల వాతావరణం ఉందని కాదు.. కాకపోతే ఆయనను ఓడించేందుకు ప్రత్యర్ధులు వేసే పాచికలే ఆయనను గెలిపించే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి ఉన్న కూటమిలోకి కాంగ్రెస్ ఎలాగూ రాదు.. అలాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును అటు కూటమి, ఇటు కాంగ్రెస్ పంచుకుంటే అంతిమంగా లాభం జరిగేది జగన్మోహన్ రెడ్డికే కదా.. పైగా జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే రకం కాదు. అతనికి ఏది అనిపిస్తే అదే చేస్తాడు. ఇందులో రెండవ దానికి తావులేదు. మరి త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్న దానినిబట్టే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? కూటమి లోకి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తారా? లేక బిజెపిని అలానే ఉంచుతారా? అనేవి తేలాల్సి ఉంది.