https://oktelugu.com/

YS Sharmila: నేడు తాడేపల్లికి షర్మిల.. జగన్ తో ఏం మాట్లాడతారో?

ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియను షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని షర్మిల న్యూ ఇయర్ వేడుకలు నాడు ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2024 / 08:46 AM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila: వైయస్ జగన్ తో సోదరి షర్మిల భేటీ కానున్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్ కు షర్మిల వెళ్ళనున్నారు. సోదరుడితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు సైతం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రాజకీయ భేటీ కాకపోవడం విశేషం.

    ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియను షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని షర్మిల న్యూ ఇయర్ వేడుకలు నాడు ప్రకటించారు. మంగళవారం ఇడుపులపాయలో వైయస్ ఘాట్ దగ్గర ఈ వివాహానికి సంబంధించి శుభలేఖను ఉంచారు. ప్రార్థనలు చేసి తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్న షర్మిల బుధవారం మధ్యాహ్నం నేరుగా ఇడుపులపాయ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా కూడా ఉంటారని తెలుస్తోంది.

    షర్మిల కుమారుడి నిశ్చితార్థం ఈనెల 18న జరగనుంది. వివాహం ఫిబ్రవరి 17న చేయనున్నట్లు షర్మిల అధికారికంగా ప్రకటించారు. అయితే రాజకీయంగా షర్మిల సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా వెళుతుండడం విశేషం. ఈ తరుణంలో ఈ వేడుకలకు జగన్ హాజరవుతారా? హాజరు వరకే పరిమితం అవుతారా? లేకుంటే మేనల్లుడు పెళ్లి బాధ్యతలను తీసుకుంటారా? అన్నది చూడాలి. నాలుగు సంవత్సరాల కిందట వరకూ ఇద్దరి మధ్య అనుబంధం ఉండేది. వైయస్సార్ వర్ధంతి, జయంతి సభల్లో కలిసే పాల్గొనేవారు. క్రిస్మస్ వేడుకలకు కుటుంబమంతా ఒకేసారి హాజరయ్యేది. కానీ వివేకానంద రెడ్డి హత్య తరువాత పరిస్థితి మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి, చెల్లిని జగన్ పట్టించుకోవడం మానేశారని ఆరోపణలు వినిపించాయి. వారి మధ్య సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయని వార్తలు వచ్చాయి. ఇటీవల కలిసిన సందర్భం కూడా లేదు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే షర్మిల సోదరుడి జగన్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే బుధవారం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమే జరగబోతోంది. సోదరిడితో భేటీలో ఏం జరుగుతుందో? భేటీ తర్వాత షర్మిల మీడియాతో ఏం మాట్లాడతారో? వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారనుంది.