Congress- YS Family: కాంగ్రెస్ కు దగ్గరవుతున్న వైఎస్ కుటుంబం.. తెర వెనుక జగన్ మంత్రాంగం?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అప్పటివరకు ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు. కానీ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ హై కమాండ్ తనను గుర్తించలేదని జగన్ ఆ పార్టీని వీడారు.

Written By: Dharma, Updated On : November 4, 2023 10:52 am

Congress- YS Family

Follow us on

Congress- YS Family: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ కి దగ్గరవుతోందా? షర్మిల ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతు తెలపడం వెనుక జగన్ ఉన్నారా? ఇందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాయభారం వహించారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారు. అదే పార్టీలో ఏళ్ల తరబడి రాజకీయం చేశారు. అసమ్మతివాది అని ముద్ర వేసుకున్నారు. ఆ ముద్రను తొలగించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు అదే కుటుంబం కాంగ్రెస్కు దగ్గరవుతుండడం విశేషం.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అప్పటివరకు ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు. కానీ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ హై కమాండ్ తనను గుర్తించలేదని జగన్ ఆ పార్టీని వీడారు. సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సుదీర్ఘకాలం పోరాడి ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అయితే ఈ పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ అండతో అడ్డగోలుగా సంపాదించుకున్న సొమ్ముతో సాక్షి మీడియాని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ మరణం తర్వాత సోనియా గాంధీ పై దారుణ రాతలతో రెచ్చిపోయారు. సోనియాయే రాజశేఖర్ రెడ్డిని చంపించారని కూడా ఒకానొక సందర్భంలో ఆరోపణలు చేశారు. షర్మిల సైతం పలు సందర్భాల్లో సోనియా గాంధీని టార్గెట్ చేసుకొని ఇదే రకమైన ఆరోపణలు చేశారు.

అయితే తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని.. ఏపీలో అన్న మాదిరిగా తెలంగాణపై పట్టు సాధించాలని షర్మిల కలలు కన్నారు. రాజన్న రాజ్యం తెస్తానని.. ఊరువాడా ప్రచారం చేశారు. అయినా సరే తెలంగాణ ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయారు. ఎన్నికలకు వెళ్తే పరువు పోతుందని భావించారు. ఈ తరుణంలో అప్పటివరకు దెయ్యంగా వర్ణించిన సోనియా దేవత అయ్యారు. కాంగ్రెస్ గొప్ప పార్టీగా వర్ణించడం ప్రారంభించారు. వైయస్ బతికుంటే ఈపాటికి రాహుల్ ప్రధాని అయ్యే వారిని చెబుతూ కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా పోటీ నుంచి తప్పుకుని ఏకపక్షంగా మద్దతు పలికారు. అయితే దీని వెనుక అన్న జగన్ ఉన్నాడని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రాంగం నడిపారని కొత్త టాక్ ప్రారంభమైంది. అది ఏపీ రాజకీయాలపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

షర్మిల రాజకీయం చేయాలంటే ఏపీలోనే చక్కనైన అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించేవారు అటు జగన్ తో పాటు ఇటు షర్మిలాని సైతం అభిమానించక తప్పరు. పైగా షర్మిల మంచి వాగ్దాటి ఉన్న మహిళా నేత. రాజన్న బిడ్డగా అభిమానులు కడుపులో పెట్టి చూసుకుంటారు. కానీ అన్నను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. తెలంగాణ వైపు అడుగులు వేశారు. తనది తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు. అయినా అక్కడి ప్రజలు విశ్వసించలేదు. కుటుంబ రాజకీయాల కోసం ఏపీని విడిచిపెట్టి ఇక్కడకు రావడం ఏమిటని అనుమానించారు. ఒకే కుటుంబం ఇరు తెలుగు రాష్ట్రాలను ఏలడం ఏమిటని ఒక రకమైన ప్రశ్న ఉత్పన్నమైంది. వెనుక ఉన్న రాజకీయం అందరికీ అర్థమవుతోంది. కాంగ్రెస్ తన తండ్రి పార్టీగా షర్మిల కొత్తగా పేర్కొనడం మరి అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్ రాజకీయాలు అంచనా వేసే జగన్ ఈ మంత్రాంగం నడిపి ఉంటారని.. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారధిగా నిలిచారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మొత్తానికైతే వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు దగ్గరవుతుండడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు. ప్రజలు మాత్రం ఈ రాజకీయాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.