YouTuber Vlogger Anvesh : యూ ట్యూబర్ల పంచాయితీ.. పరిష్కార మార్గం అమెరికన్ ప్రెసిడెంట్ బైడెనే చూపించాలి

సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య పంచాయితీ అమెరికా వల్ల మొదలైంది కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతుందేమో.. అసలే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.. ఈ పంచాయితీని పరిష్కారం చేస్తే నాలుగు తెలుగు వాళ్ళ ఓట్లు బైడెన్ కు పడతాయేమో?!

Written By: NARESH, Updated On : March 23, 2024 9:42 pm

naa-anvesna-vloger

Follow us on

YouTuber Vlogger Anvesh : వెనుకటి రోజుల్లో వీధి కోళాయిల దగ్గర అమ్మలక్కలు పంచాయితీలు పెట్టుకునేవారు. అవి మరి అంత పెద్దవి కాకపోయినప్పటికీ.. భలే రసవత్తరంగా సాగేవి. ఒక్కోసారి పెద్ద మనుషుల దాకా వ్యవహారం వెళ్ళేది. తర్వాత ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గం లభించేది. ఇక అప్పటినుంచి షరామాములే. మళ్లీ ఏదో రూపంలో గొడవ జరగడం.. కొద్దిరోజులపాటు పరస్పరం తిట్లు తిట్టుకోవడం.. అనంతరం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళటం.. ఇదొక ప్రహసనం లాగా ఉండేది. ఇప్పుడు కాలం మారింది. వీధి కొళాయిలు ఉన్నప్పటికీ పంచాయితీలు పెట్టుకునేంత తీరిక అమ్మలక్కలకు లేదు. అయితే వంటింట్లో.. లేకుంటే టీవీ ముందు.. ఇంకా తీరిక ఉంటే ఏదో ఒక పనిలో.. పైగా ఇరుగుపొరుగు ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకునేంత సాన్నిహిత్యాలు ఈ రోజుల్లో లేవు. ఈ స్మార్ట్ కాలంలో పంచాయితీలు లేకుంటే ఎలా ఉంటుందనుకున్నాడో.. కంటెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాడో.. తెలియదు గాని ప్రముఖ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్.. ఓ గొడవ మొదలుపెట్టాడు. ఈసారి తోటి యూట్యూబర్ ను టార్గెట్ చేశాడు.

ఇంతకీ ఆయన బాధకు కారణం ఏంటయ్యా అంటే.. “ప్రపంచయాత్రికుడిని నేను. అనేక కష్టనష్టాలు పడి ఇతర దేశాలు తిరిగింది నేను. మెలిసా.. ఇంకా చాలామంది అమ్మాయిలతో పులిహోర కలిపింది నేను. నా రికార్డు వేరు. నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు” అనే రేంజ్ లో ఉంటుంది నా అన్వేషణ అన్వేష్ వ్యవహార శైలి. ఒక యూట్యూబర్ గా అతని ప్రయాణం వినూత్నం. చాలా కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చాడు. సెల్ఫ్ ప్రమోషన్ కోసం తాపత్రయపడతాడు గాని.. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కడు. నిక్కచ్చిగా ఉంటాడు.. చేసిన ప్రతి పనిని చెప్పుకుంటాడు. అలాంటి అన్వేష్ ఒక యూట్యూబర్ పై విమర్శలకు దిగాడు. గతంలో యూట్యూబర్ లను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేవాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నాడు.

సన్నీ యాదవ్ అని ఓ యూట్యూబర్ ఉన్నాడు. ఇతడు ఇటీవల అమెరికా వెళ్లాడు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఇతడు సైకిల్ మీద అమెరికా వెళ్లాడని చెప్పుకున్నాడు. సరే ఆయన సైకిల్ మీద వెళ్ళాడా.. మరే దాని మీద వెళ్లాడా అనేది ఎవరూ చూడలేదు. దానికి రుజువులు కూడా లేవు. అలాంటప్పుడు ఆయన చెప్పింది చాలామంది నమ్మారు. కొంతమంది శభాష్ అన్నారు. ఇంకా కొంతమంది తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టావని అన్నారు. ఈ మాటలు అన్వేష్ కు ఎక్కడో తగిలినట్టున్నాయి. ఇంకేముంది అన్వేష్ విమర్శలు మొదలు పెట్టాడు. ఏకంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. తెలంగాణ యాసలో సన్నీ యాదవ్ ను విమర్శించాడు. అసలు అతడు చేసిన యాత్ర మొత్తం అబద్ధమని.. సైకిల్ మీద అమెరికా వెళ్లడం ఎలా సాధ్యమని ధ్వజమెత్తాడు.

సహజంగానే అన్వేష్ కు సోషల్ మీడియాలో రీచ్ ఎక్కువ. పైగా అతడు అప్లోడ్ చేసే వీడియోలకు ఫాన్స్ కూడా ఎక్కువే. ఇంకేముంది క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇంకేముంది కొంతమంది అన్వేష్ ను సపోర్ట్ చేశారు. మరి కొంతమంది సన్నీ యాదవ్ కు మద్దతు పలికారు. ఇంకా కొంతమంది ప్రాంతీయ భేదాలను లేవనెత్తడం మొదలుపెట్టారు . ఈ పంచాయితీ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య పంచాయితీ అమెరికా వల్ల మొదలైంది కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతుందేమో.. అసలే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.. ఈ పంచాయితీని పరిష్కారం చేస్తే నాలుగు తెలుగు వాళ్ళ ఓట్లు బైడెన్ కు పడతాయేమో?!